Mega DSC: మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్‌ చిక్కు.. వివాహిత అభ్యర్థులకు కొత్త నిబంధన

Mega DSC EWS issue new rule for married candidates
  • వివాహిత మహిళల ఈడబ్ల్యూఎస్‌పై విద్యాశాఖ కొర్రీ
  • తండ్రికి బదులుగా భర్త ఆదాయ ధ్రువీకరణ తప్పనిసరి
  • సంపన్న కుటుంబాల మహిళలు కోటా పొందుతున్నారంటూ ఫిర్యాదులు
  • కొత్త సర్టిఫికెట్ల కోసం అభ్యర్థుల పరుగులు, తీవ్ర గందరగోళం
మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో కీలకమైన సర్టిఫికెట్ల పరిశీలన దశలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులకు విద్యాశాఖ అనూహ్యమైన నిబంధన విధించడంతో వారిలో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు తండ్రి పేరుతో సమర్పించిన ఈడబ్ల్యూఎస్‌ ధ్రువపత్రాలు చెల్లవని, తాజాగా భర్త పేరుతో, ఆయన ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని జారీ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

డీఎస్సీ దరఖాస్తు సమయంలో మహిళా అభ్యర్థులు వివాహితులా, అవివాహితులా అనే వివరాలను స్పష్టంగా తీసుకున్నారు. అయితే, వివాహిత మహిళలు తమ విద్యార్హతలు, ఇతర రిజర్వేషన్ పత్రాల మాదిరిగానే ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ను కూడా తండ్రి కుటుంబ ఆదాయం ఆధారంగానే సమర్పించారు. దీనిపై కొన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వివాహం తర్వాత సంపన్న కుటుంబాలలోకి వెళ్లిన కొందరు మహిళలు, తమ పుట్టింటి ఆదాయాన్ని చూపి ఈడబ్ల్యూఎస్‌ ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెంటనే స్పందించింది. వివాహిత మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లను పునఃపరిశీలించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను (డీఈవోలు) ఆదేశించింది. ఈ ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు, ఒక జిల్లాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులను గుర్తించారు. వీరిలో 35 మంది తండ్రి పేరుతో ఉన్న ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. వెంటనే స్పందించి, భర్త పేరుతో కొత్త సర్టిఫికెట్లు తేవాలని వారికి సూచించారు.

దీంతో ఎంపిక జాబితాలో ఉన్న ఆ అభ్యర్థులు హుటాహుటిన మండల రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు తీసి, కొత్త ధ్రువపత్రాలు సమర్పించారు. గురువారం సాయంత్రం నాటికి ఇద్దరు మినహా మిగిలిన వారందరూ కొత్త సర్టిఫికెట్లను అందించినట్లు సమాచారం. అయితే, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియలో తరచూ ఇలాంటి మార్పులు చోటుచేసుకోవడం, కొత్త నిబంధనలు తెరపైకి రావడం అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది.
Mega DSC
EWS certificate
DSC certificate verification
AP DSC
School education department
Married women candidates
EWS eligibility criteria
Income certificate
Educational qualifications
Government jobs

More Telugu News