Honda: జీఎస్టీ ఎఫెక్ట్... ద్విచక్ర వాహనాల ధరలు తగ్గించిన హోండా

Honda Announces Price Reduction After GST Cut
  • 350 సీసీ లోపు బైక్స్‌, స్కూటర్లపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన కేంద్రం
  • మోడల్ ను బట్టి గరిష్టంగా రూ.18,887 వరకు ధరల తగ్గింపు లభిస్తుందన్న హోండా
  • ద్విచక్ర వాహనాలు మరింత అందుబాటులోకి వస్తాయన్న హోండా సేల్స్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్ యోగేశ్‌ మాథూర్
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా జీఎస్టీ సవరణ నిర్ణయం ద్విచక్ర వాహనాల పరిశ్రమపై తక్షణ ప్రభావాన్ని చూపుతోంది. 350 సీసీ లోపు బైక్‌లు, స్కూటర్లపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ అండ్‌ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్ఐ) ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

ఏ మోడళ్లపై తగ్గింపు?

హోండా తెలిపిన వివరాల ప్రకారం.. వినియోగదారులు ఎంపిక చేసుకునే మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.18,887 వరకు ధరల తగ్గింపు లభించనుంది. ధర తగ్గింపు పొందుతున్న మోడల్స్‌లో ప్రధానంగా ఇవి ఉన్నాయి:

యాక్టీవా (Activa), డియో (Dio), షైన్ (Shine), యూనికార్న్ (Unicorn), సీబీ350 సిరీస్ (CB350 Series). ఈ ధరల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

హోండా స్పందన:

హోండా సేల్స్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్ యోగేశ్‌ మాథూర్ మాట్లాడుతూ.. “కేంద్రం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని హోండా స్వాగతిస్తోంది. దీని వల్ల ద్విచక్ర వాహనాలు మరింత అందుబాటులోకి వస్తాయి. వినియోగదారులకు ఇది గణనీయమైన ఊరటనిస్తుందని మా నమ్మకం” అని పేర్కొన్నారు.

కొన్ని మోడళ్లపై ఇంకా స్పష్టత లేదు

అయితే, 40 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకి వచ్చే కొన్ని ప్రత్యేక మోడళ్లపై ధరల ప్రభావాన్ని కంపెనీ ఇంకా పరిశీలిస్తోందని హోండా తెలిపింది. వాటిపై నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉందని వెల్లడించింది. 
Honda
Honda Activa
Honda Dio
Honda Shine
Honda Unicorn
CB350 Series
Two wheeler prices
GST reduction
Bike prices reduced
Yogesh Mathur

More Telugu News