Anil Kumar Singhal: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్ష

Anil Kumar Singhal Reviews Srivari Brahmotsavam Arrangements
  • తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి
  • అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే ఈసారి బ్రహ్మోత్సవాలు మరింత విజయవంతం చేయాలన్న ఈవో
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు సమిష్టిగా పనిచేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. అన్నమయ్య భవన్‌లో ఈవో అధ్యక్షతన జరిగిన శాఖలవారీ సమీక్షా సమావేశంలో విస్తృత చర్చ జరిగింది.

ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివరించారు.

ఈవో అనిల్ సింఘాల్ మాట్లాడుతూ..“బ్రహ్మోత్సవాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మాడ వీధులు పరిశుభ్రంగా ఉండేలా అదనపు సిబ్బందిని నియమించాలి. గరుడ సేవ రోజు సీనియర్ అధికారులను మాడ వీధుల్లో క్రమబద్ధంగా కేటాయించి, భక్తుల నుంచి స్పందన సేకరించాలి” అని సూచించారు.

అలాగే, గ్యాలరీల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాల పంపిణీ, తిరుమల, తిరుపతిలో వాహనాల పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు, నాదనీరాజనం వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని ఈవో ఆదేశించారు.

సుమారు 3,500 మంది శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీసులతో సమన్వయం, కామన్ కమాండ్ సెంటర్ ద్వారా తిరుమలలోని భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే ఈసారి బ్రహ్మోత్సవాలు మరింత విజయవంతంగా జరుగుతాయని ఈవో ఆకాంక్షించారు. 
Anil Kumar Singhal
TTD Brahmotsavam
Tirumala
Tirupati
Brahmotsavam 2024
TTD EO
Srivari Brahmotsavam
Annual festival
Andhra Pradesh Festivals

More Telugu News