BMTC Bus: కర్ణాటకలో చేయి చేసుకునే వరకు వెళ్లిన డ్రైవర్, ప్రయాణికురాలి గొడవ.. ఇదిగో వీడియో

BMTC Bus Driver and Woman Passenger Fight in Bengaluru
  • బెంగళూరు బీఎంటీసీ బస్సులో మహిళ, డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం
  • ఒకరిపై ఒకరు చేయి చేసుకుని దాడికి పాల్పడిన వైనం
  • ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ప్రయాణికుడు
  • వైరల్‌గా మారిన వీడియోపై స్పందించిన నగర పోలీసులు
  • డ్రైవర్, మహిళ ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
  • విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
కర్ణాటక రాజధాని బెంగళూరులో బీఎంటీసీ బస్సులో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ప్రయాణికురాలికి, బస్సు డ్రైవర్‌కు మధ్య మొదలైన చిన్న వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. ఇద్దరూ సహనం కోల్పోయి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. బస్సులోని తోటి ప్రయాణికుడు ఈ ఘటనను తన ఫోన్‌లో రికార్డు చేయడంతో ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.

పీన్యా సమీపంలో బీఎంటీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు, డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది ముదరడంతో ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రయాణికురాలు గొడవపడుతూ సీటు వెనుక నుండి డ్రైవర్‌పై చేయి చేసుకుంది. వెంటనే అతనూ ఆమెను కొట్టాడు.

బస్సులోని ఇతర ప్రయాణికులు కల్పించుకుని వారిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోను 'కర్ణాటక పోర్ట్‌ఫోలియో' అనే 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.

ఈ వీడియోపై బెంగళూరు నగర పోలీసులు స్పందించారు. తదుపరి చర్యల నిమిత్తం ఈ ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపినట్లు వారు వెల్లడించారు. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, ఈ గొడవకు అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళదే తప్పంటూ, "ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి దిగింది, ఆమెను అరెస్టు చేయాలి" అని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం డ్రైవర్ ప్రవర్తనను తప్పుబడుతూ, ప్రయాణికురాలిపై చేయి చేసుకోవడం సరికాదని విమర్శిస్తున్నారు.
BMTC Bus
Bengaluru
Karnataka
Bus driver
Woman passenger
Road rage
Public transport
Peenya

More Telugu News