Suryakumar Yadav: ఔటైన బ్యాటర్‌ను వెనక్కి పిలిచి మరీ ఆడించాడు.. క్రీడాస్ఫూర్తితో మనసులు గెలిచిన కెప్టెన్ సూర్య!

Suryakumar Yadav Wins Hearts Recalling Dismissed Batsman
  • యూఏఈతో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ గొప్ప క్రీడాస్ఫూర్తి
  • స్టంపౌట్ అప్పీల్‌ను ఉపసంహరించుకున్న భారత కెప్టెన్
  • బౌలర్ టవల్ జారడంతో బ్యాటర్ దృష్టి మరలడమే కారణం
  • థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం
ఆసియా కప్ 2025లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రీడాస్ఫూర్తితో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. నిబంధనల ప్రకారం ఔటైనప్పటికీ, ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌కు మరో అవకాశం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. ఐసీసీ 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అవార్డుకు ఆయన పేరును పరిశీలించేంతటి గొప్ప సంఘటన ఇది.

బుధవారం యూఏఈతో జరిగిన ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూఏఈ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ను భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే వేస్తున్నాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్యాటర్ జునైద్ సిద్ధిఖీ, దూబే వేసిన బౌన్సర్‌కు అప్రమత్తమయ్యాడు. అదే సమయంలో బౌలర్ దూబే పరుగెడుతుండగా అతని నడుముకు ఉన్న టవల్ కిందపడిపోయింది. దీనిని గమనించి అంపైర్‌కు సూచిస్తూ సిద్ధిఖీ అజాగ్రత్తగా క్రీజు ముందుకు వచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్ వెంటనే బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్ చేశాడు.

ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించగా, రీప్లేలలో సిద్ధిఖీ క్రీజు బయట ఉన్నట్లు స్పష్టంగా తేలింది. దీంతో అంపైర్ ఔట్‌గా ప్ర‌క‌టించారు. అయితే, సిద్ధిఖీ మైదానం వీడకుండా అక్కడే నిలబడి చూస్తుండగా, కెప్టెన్ సూర్యకుమార్ అంపైర్లతో చర్చించాడు. బౌలర్ టవల్ జారిపోవడం వల్లే బ్యాటర్ దృష్టి మరలిందని గ్రహించిన సూర్య, తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో సిద్ధిఖీ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.

అయితే, ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అదే ఓవర్‌లో దూబే విసిరిన మరో షార్ట్ బాల్‌కు సిద్ధిఖీ ఔటయ్యాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, భారత బౌలర్ల ధాటికి యూఏఈ జట్టు 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు సహా మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టి యూఏఈ పతనాన్ని శాసించాడు. శివమ్ దూబే మూడు వికెట్లతో రాణించాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక వికెట్ తీశాడు. ఆ త‌ర్వాత టీమిండియా 58 ప‌రుగుల స్వ‌ల్ప‌ ల‌క్ష్యాన్ని కేవ‌లం 4.3 ఓవ‌ర్ల‌లోనే ఛేదించి రికార్డు విజ‌యాన్ని న‌మోదు చేసింది. 
Suryakumar Yadav
Suryakumar Yadav spirit of cricket
Asia Cup 2025
India vs UAE
Shivam Dube
Sanju Samson
Kuldeep Yadav
Junaid Siddiqui
cricket
ICC Spirit of Cricket Award

More Telugu News