Larry Ellison: మస్క్ ఆధిపత్యానికి బ్రేక్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ల్యారీ ఎల్లిసన్

Larry Ellison overtakes Elon Musk as worlds richest person
  • ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానానికి చేరిన ఒరాకిల్ అధినేత
  • రెండో స్థానానికి పడిపోయిన టెస్లా అధిపతి ఎలాన్ మస్క్
  • ఒక్కరోజే 41 శాతం పెరిగిన ఒరాకిల్ కంపెనీ షేర్లు
  • ఎల్లిసన్ సంపద ఒక్కరోజులో 101 బిలియన్ డాలర్ల మేర వృద్ధి
  • దాదాపు 300 రోజులుగా కొనసాగుతున్న మస్క్ ఆధిపత్యానికి తెర
ప్రపంచ కుబేరుల జాబితాలో పెను సంచలనం నమోదైంది. దాదాపు 300 రోజులుగా అగ్రస్థానంలో తిరుగులేకుండా కొనసాగుతున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధిపత్యానికి అనూహ్యంగా తెరపడింది. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ సహ-వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్, మస్క్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఒరాకిల్ కంపెనీ షేర్ల విలువ ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా పెరగడమే ఈ అనూహ్య మార్పుకు కారణమైంది.

ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం, బుధవారం ట్రేడింగ్‌లో ఒరాకిల్ షేరు విలువ ఏకంగా 41 శాతం పెరిగింది. 1992 తర్వాత కంపెనీ షేరు ఒక్కరోజులో ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. కంపెనీ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించిపోవడం, ముఖ్యంగా క్లౌడ్ వ్యాపారంపై అత్యంత సానుకూల అంచనాలు వెలువడటంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను కొనుగోలు చేశారు.

ఈ షేర్ల ర్యాలీతో ల్యారీ ఎల్లిసన్ వ్యక్తిగత సంపద ఒక్కరోజులోనే 101 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.89 లక్షల కోట్లు) పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద 395.70 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 34.82 లక్షల కోట్లు) చేరుకుంది. ప్రస్తుతం ఒరాకిల్ కంపెనీలో ఎల్లిసన్‌కు 41 శాతం వాటా ఉంది. ఇదే సమయంలో రెండో స్థానానికి పడిపోయిన ఎలాన్ మస్క్ సంపద 385 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 33.88 లక్షల కోట్లు) నమోదైంది. ఈ ఒక్కరోజు మార్పుతో ఒరాకిల్ మార్కెట్ విలువ కూడా సుమారు 299 బిలియన్ డాలర్లు పెరిగి, లక్ష కోట్ల డాలర్ల మార్క్‌కు చేరువ కావడం గమనార్హం.
Larry Ellison
Oracle
Elon Musk
Forbes Billionaires
Richest person
Wealth
Stock market
Oracle stock
Technology
Cloud computing

More Telugu News