RSV: మీ ఇంట్లో పసిపిల్లలు ఉన్నారా?.. అయితే ఈ వైరస్ గురించి తప్పక తెలుసుకోవాలి!

Even healthy children can be severely affected by RSV says Study
  • ఆరోగ్యంగా, నెలలు నిండి పుట్టిన శిశువులకూ ఆర్ఎస్‌వీ వైరస్ ముప్పు
  • ముఖ్యంగా తొలి మూడు నెలల వయసులో ప్రమాదం చాలా ఎక్కువ
  • తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితి వస్తోందని వెల్లడి
  • స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధనలో కీలక అంశాలు
  • నివారణకు చికిత్స, గర్భిణులకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని సూచన
పసిపిల్లల తల్లిదండ్రులకు ఇది ఓ ముఖ్యమైన హెచ్చరిక. నెలలు నిండి, పూర్తి ఆరోగ్యంగా పుట్టిన శిశువులు కూడా తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని ఓ తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్‌వీ) ఇన్ఫెక్షన్ కారణంగా చిన్నారులు ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావడం లేదా ఇంటెన్సివ్ కేర్ (ఐసీయూ)లో చికిత్స తీసుకోవాల్సి రావడం వంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పుట్టిన మొదటి మూడు నెలల్లో ఈ ప్రమాదం అత్యధికంగా ఉన్నట్టు గుర్తించారు.

చిన్న పిల్లలలో శ్వాసకోశ సమస్యలకు ఆర్ఎస్‌వీ వైరస్ ఒక ప్రధాన కారణం. నెలలు తక్కువ పుట్టిన పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారులకు ఈ వైరస్‌తో ప్రమాదం ఎక్కువని చాలాకాలంగా తెలుసు. అయితే, ఆరోగ్యంగా పుట్టిన పిల్లలపై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో స్వీడన్‌లోని ప్రముఖ కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు దీనిపై లోతైన అధ్యయనం చేపట్టారు.

2001 నుంచి 2022 మధ్య స్వీడన్‌లో జన్మించిన 23 లక్షల మందికి పైగా చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని వారు విశ్లేషించారు. ఆర్ఎస్‌వీ ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఐసీయూలో చేరిన వారిలో అత్యధికులు.. నెలలు నిండి, ఆరోగ్యంగా పుట్టిన మూడు నెలల లోపు శిశువులేనని ఈ పరిశోధనలో తేలింది. ఈ అధ్యయన ఫలితాలను "ది లాన్సెట్ రీజినల్ హెల్త్-యూరప్" జర్నల్‌లో ప్రచురించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఆర్ఎస్‌వీ కారణంగా సుమారు 36 లక్షల మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతుండగా, ఐదేళ్లలోపు వయసున్న లక్ష మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 1.7 శాతం మంది చిన్నారులకు ఆర్ఎస్‌వీ సోకగా, వారిలో దాదాపు 12 శాతం మంది (4,621 మంది) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

ప్రమాదాన్ని పెంచే అంశాలు
పరిశోధకులు ఆర్ఎస్‌వీ తీవ్రతను పెంచే మరికొన్ని అంశాలను కూడా గుర్తించారు. చలికాలంలో పుట్టిన పిల్లలు, 0-3 ఏళ్ల వయసున్న తోబుట్టువులు, కవల పిల్లలకు ఈ వైరస్‌తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. అలాగే, పుట్టినప్పుడు తక్కువ బరువుతో ఉన్న చిన్నారులకు ఈ ముప్పు దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్టు వారు పేర్కొన్నారు. ఇతర అనారోగ్య సమస్యలున్న పిల్లలకు ఈ ప్రమాదం నాలుగు రెట్లకు పైగా ఉందని స్పష్టం చేశారు.

"చికిత్సా వ్యూహాలు రూపొందించేటప్పుడు, ఆరోగ్యంగా పుట్టిన శిశువులు కూడా ఆర్ఎస్‌వీ వల్ల తీవ్రంగా ప్రభావితమవుతారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం" అని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వైద్యురాలు గియులియా డల్లాజియాకోమా తెలిపారు. అయితే, ఈ వైరస్‌ను నివారించడానికి ప్రస్తుతం నవజాత శిశువులకు చికిత్స, గర్భిణులకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు.
RSV
Respiratory Syncytial Virus
RSV infection
infant health
child health
Karolinska Institutet
Giulia D'Alleggri
pediatrics
viral infections
childcare

More Telugu News