YS Sharmila: ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు: షర్మిల

YS Sharmila Slams TDP YCP Janasena for Voting RSS Candidate
  • ఉపరాష్ట్రపతి ఎన్నిక... టీడీపీ, వైసీపీ, జనసేనపై షర్మిల ఫైర్
  • తెలుగు బిడ్డకు కాకుండా బీజేపీ అభ్యర్థికి ఓటేశారని విమర్శ
  • మోదీ ప్రయోజనాల కోసమే మూడు పార్టీలు పనిచేశాయని ఆరోపణ
  • జగన్ తన కేసుల నుంచి బయటపడేందుకే కేంద్రానికి దాసోహమన్న షర్మిల
  • రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు, పవన్ తాకట్టు పెట్టారని ధ్వజం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని ప్రధాన పార్టీల వైఖరిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా, బీజేపీ-ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు తెలుగు జాతికి తీరని ద్రోహం చేశాయని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ చర్యను తెలుగు జాతికి చీకటి రోజుగా ఆమె అభివర్ణించారు.

"తెలుగు జాతికి నేడు చీకటి రోజు. ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ... తెలుగు జాతికి చేసింది నేడు తీరని ద్రోహం. రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీ పడితే, ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు. తెలుగు ప్రజల ప్రయోజనాల కన్నా.. స్వలాభమే ధ్యేయంగా.. మత పిచ్చి మోదీ గారికి మోకాళ్లోత్తడమే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ, జనసేన చేసిన నీచ రాజకీయాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ-ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఓటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయకపోవడం అత్యంత బాధాకరం. తెలుగు పార్టీలు తెలుగు బిడ్డకు మద్దతుగా నిలవకపోవడం అత్యంత దురదృష్టకరం. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానం. 

చంద్రబాబు గారిని, జగన్ మోహన్ రెడ్డి గారిని, పవన్ కల్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కంటే మోదీ గారితో స్వప్రయోజనమే మీకు ముఖ్యమా...? పోటీలు పడి మోదీ దగ్గర మోకరిల్లాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది..? రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం మీకు కనిపించలేదా...? 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి గొంతు కోసిన విధానం గుర్తుకు రాలేదా...? ఢిల్లీని మించిన రాజధాని కడతామని 11 ఏళ్లుగా దగా పడ్డామని అనిపించలేదా...? రాష్ట్ర జీవనాడి పోలవరంలో జీవం తీసేస్తే మీలో చలనం లేదా...? విశాఖ స్టీల్ ను పబ్లిక్ గా అమ్ముతుంటే మీకు రోషం లేదా...? దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఎలాగో కీలుబొమ్మలు... కనీసం సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రాష్ట్రం గురించి అడిగే స్వరం ఢిల్లీలో ఉండేదన్న సోయి లేకపోవడం బాధాకరం.

కూటమి పార్టీలతో తోడుగా పోటీపడి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు వైసీపీ సిగ్గుపడాలి. ప్రతిపక్షంలో ఉంటూ, ప్రతిపక్షాల అభ్యర్థిని కాదని అధికార పక్షానికి మద్దతు ఇవ్వడం ప్రపంచంలోనే ఇదొక వింత. ఇక రాష్ట్రంలో వైసీపీకి ప్రతిపక్షం, ప్రజల పక్షం అని చెప్పుకోవడానికి అర్హత లేదు. అపోజిషన్ ముసుగులో రాష్ట్రంలో జగన్ గారు కూడా బీజేపీ పక్షమే. బీజేపీకి అవసరమైనపుడు పనికొచ్చే పక్షమే. ఐదేళ్లలో దోచుకున్నది దాచుకోవడానికి కేంద్రానికి బానిస అయ్యారు. కేసులకు భయపడి మోదీ గారికి దాసోహం అన్నారు. తనను తాను రక్షించుకునేందుకు దత్తపుత్రుడిగా అవతారం ఎత్తి తెలుగు జాతికి జగన్ గారు నేడు చేసింది తీరని ద్రోహమే" అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. 

YS Sharmila
YS Sharmila comments
Vice President Election
Sudarshan Reddy
TDP
YCP
Janasena
BJP
RSS
Telugu people

More Telugu News