C.P. Radhakrishnan: ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్... ఓట్ల లెక్కింపు ప్రారంభం

Vice President Election Polling Concludes Vote Counting Begins
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్
  • ఎన్డీఏ అభ్యర్థిగా సి.పి. రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి
  • తొలి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం
భారత తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ భవనంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పార్లమెంట్‌లోని ఉభయ సభల సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరికంటే ముందుగా తన ఓటు వేశారు.

సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపును ప్రారంభమైంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. దీంతో మరికొన్ని గంటల్లోనే దేశ నూతన ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోనుంది.

ఈ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, విపక్షాల 'ఇండియా' కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేయగా, ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు.

అయితే, ఈ ఎన్నికల్లో మొత్తం 13 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరిలో బిజూ జనతాదళ్ (బీజేడీ) నుంచి ఏడుగురు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి నలుగురు, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నుంచి ఒకరు, మరో స్వతంత్ర ఎంపీ ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన మద్దతు లభించడం లేదన్న కారణంతో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది.

సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు స్పష్టమైన ఆధిక్యం కనబడుతోంది. మొత్తం 781 మంది ఎంపీలున్న పార్లమెంటులో గెలుపునకు 391 ఓట్లు అవసరం కాగా, రాధాకృష్ణన్‌కు 427 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు అంచనా. విపక్షాల అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 354 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశం ఉంది.

జగ్దీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
C.P. Radhakrishnan
Vice President Election 2024
India Alliance
NDA
B. Sudarshan Reddy
Parliament
Narendra Modi
Voting Results

More Telugu News