Justin Trudeau: కెనడాకు కూడా పాకిస్థాన్ పరిస్థితే ఎదురవుతుంది: ఖలిస్థానీ ఉగ్రవాదంపై ఓ నివేదిక తీవ్ర హెచ్చరిక

Justin Trudeau Khalistan extremism report warns Canada of Pakistan like situation
  • ఖలిస్థానీ ఉగ్రవాదుల విషయంలో కెనడాకు తీవ్ర హెచ్చరిక
  • ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పాకిస్థాన్ లాంటి పరిస్థితేనని నివేదిక వెల్లడి
  • కెనడా గడ్డపై ఖలిస్థానీ ఉగ్ర నిధుల సేకరణ జరుగుతోందని అంగీకారం
  • కెనడా ప్రభుత్వ ఆర్థిక శాఖ నివేదికలోనే ఈ నిజాలు వెల్లడి
  • స్వచ్ఛంద సంస్థల పేరుతో విరాళాలు, డ్రగ్స్ దందాతో నిధుల సేకరణ
ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపుల విషయంలో కఠినంగా వ్యవహరించని పక్షంలో కెనడా కూడా భవిష్యత్తులో పాకిస్థాన్ ఎదుర్కొంటున్న తీవ్ర పరిణామాలనే చవిచూడాల్సి వస్తుందని ఓ నివేదిక హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్థాన్, చివరికి అదే ఉగ్రవాదానికి బలవుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ, కెనడా కూడా అదే ప్రమాదకరమైన మార్గంలో పయనిస్తోందని 'ఖల్సా వాక్స్' అనే పత్రిక తన నివేదికలో పేర్కొంది.

భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్థానీ వేర్పాటువాదులు కెనడాలో యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నా అక్కడి ప్రభుత్వం ఏళ్ల తరబడి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని నివేదిక విమర్శించింది. భారత జాతీయ పతాకాన్ని అవమానించడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర రాజకీయ నాయకులపై బహిరంగంగా విషం చిమ్మడం వంటివి చేస్తున్నా కెనడా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం చూస్తుంటే ఆ గ్రూపులకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొంది. ఈ విషయంలో మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారని, ఆయన తర్వాత ప్రధాని పగ్గాలు అందుకున్న మార్క్ కార్నీ అయినా ఈ తప్పును సరిదిద్దుకుంటారో లేదో చూడాలని నివేదిక వ్యాఖ్యానించింది.

కాగా, కెనడా ప్రభుత్వం ఇటీవల తొలిసారిగా తమ గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపులు పనిచేస్తున్నాయని, నిధులు సేకరిస్తున్నాయని అధికారికంగా అంగీకరించడం గమనార్హం. మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సేకరణపై కెనడా ఆర్థిక శాఖ రూపొందించిన నివేదికలోనే ఈ వాస్తవాలను అంగీకరించింది. కెనడాతో పాటు మరికొన్ని దేశాల్లోనూ ఈ ఖలిస్థానీ గ్రూపులు నిధులు సేకరిస్తున్నట్లు అనుమానాలున్నాయని ఆ నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.

స్వచ్ఛంద సంస్థల పేరుతో మోసపూరిత విరాళాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, వాహనాల దొంగతనం వంటి మార్గాల్లో ఈ గ్రూపులు నిధులు సమకూర్చుకుంటున్నాయని నివేదిక వెల్లడించింది. సిక్కు ప్రవాసుల నుంచి సేకరించిన విరాళాలను కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా, క్రౌడ్ ఫండింగ్, క్రిప్టోకరెన్సీ వంటి ఆధునిక పద్ధతులను కూడా ఉగ్ర నిధుల సమీకరణకు వాడుకుంటున్నట్లు కెనడా ప్రభుత్వ నివేదిక వివరించింది.
Justin Trudeau
Khalistan terrorism
Canada
Pakistan
Khalistan groups
Narendra Modi
Mark Carney

More Telugu News