KP Oli: నిరసన జ్వాలల్లో నేపాల్.. ప్రధాని అధికారిక నివాసానికి నిప్పు

Nepal Political Crisis Protesters Torch PM Olis Residence
  • నేపాల్‌ను చుట్టుముట్టిన నిరసన జ్వాలలు
  • ప్రధాని అధికారిక నివాసానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • అధ్యక్షుడు, మాజీ ప్రధానుల ఇళ్లు, పార్టీ ఆఫీసులపై దాడులు
  • సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసినా శాంతించని యువత
  • పరిస్థితిపై చర్చకు ప్రధాని ఓలీ అఖిలపక్ష భేటీ
నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అదుపుతప్పాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆందోళనకారులు రాజధాని ఖాట్మండులో విధ్వంసం సృష్టిస్తున్నారు.

ప్రధాని ఓలీ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో యువత చేపట్టిన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఇటీవల ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, వారి ఆగ్రహం చల్లారలేదు. ఖాట్మండులోని పార్లమెంట్ వద్దకు వేలాదిగా చేరుకున్న నిరసనకారులు రహదారులను దిగ్బంధించారు. అనంతరం ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి భవనానికి నిప్పుపెట్టారు.

ఆందోళనకారుల దాడులు కేవలం ప్రధాని నివాసానికే పరిమితం కాలేదు. దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ అధికారిక నివాసం, మాజీ ప్రధానులు పుష్ప కమల్ దహల్ (ప్రచండ), షేర్ బహదూర్ డ్యూబాల ఇళ్లపై కూడా దాడులు చేసి నిప్పుపెట్టారు. మంత్రులు పృథ్వీ సుబ్బ గురుంగ్, రమేశ్‌ లేఖక్, యూఎంఎల్ నేత మహేశ్‌ బాస్నేట్, నేపాలీ కాంగ్రెస్ నేత గగన్‌థాపాతో సహా పలువురు కీలక నేతల నివాసాలు, కార్యాలయాలు దాడులకు గురయ్యాయి. ఖాట్మండులోని నేపాలీ కాంగ్రెస్, యూఎంఎల్ పార్టీల ప్రధాన కార్యాలయాలను కూడా ఆందోళనకారులు దహనం చేశారు.

ఈ హింసాత్మక పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించి, సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రధాని కేపీ ఓలీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
KP Oli
Nepal protests
Nepal political crisis
Kathmandu violence
Ram Chandra Paudel
Pushpa Kamal Dahal
Sher Bahadur Deuba
Nepal government
Social media ban
Nepal PM residence attack

More Telugu News