Aishwarya Rai: నా ఫొటోలు మార్ఫింగ్ చేసి వాడుకుంటున్నారు: కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్

Delhi High Court hears Aishwarya Rais photo morphing case
  • ఏఐతో ఫొటోలు మార్ఫింగ్ చేసి అశ్లీలంగా వాడుకుంటున్నారని ఆరోపణ
  • నకిలీ కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా తన పేరు వాడుకున్నారని కోర్టుకు వెల్లడి
  • ఐశ్వర్యకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని కోర్టు సంకేతం
  • టీషర్టులు, వాల్‌పేపర్ల అమ్మకాలపై కూడా న్యాయవాది అభ్యంతరం
  • తదుపరి విచారణ 2026 జనవరి 15కు వాయిదా
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. తన అనుమతి లేకుండా కొందరు తన పేరు, ఫొటోలు, కీర్తిని వాణిజ్యపరంగా, అశ్లీల ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం, ఐశ్వర్య పర్సనాలిటీ హక్కులకు రక్షణగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సంకేతాలిచ్చింది.

జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఐశ్వర్య తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేథి వాదనలు వినిపిస్తూ, కొన్ని ఆన్‌లైన్ సంస్థలు, వ్యక్తులు ఆమె కీర్తిని దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇది చాలా షాకింగ్‌గా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. నా క్లయింట్ పేరు, ముఖం వాడుకుని డబ్బు సంపాదిస్తున్నారు" అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

‘ఐశ్వర్య నేషన్ వెల్త్’ అనే ఒక సంస్థ తమ లెటర్‌హెడ్‌పై ఆమె ఫొటోను ముద్రించి, ఆమెను ఆ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా తప్పుగా చూపించిందని న్యాయవాది తెలిపారు. మరికొందరు ఐశ్వర్య రాయ్ ఫొటోలతో టీషర్టులు, వాల్‌పేపర్లు అమ్ముతూ ఆమె హక్కులను ఉల్లంఘిస్తున్నారని వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ కరియా, ప్రతివాదులకు వ్యతిరేకంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీనిపై పూర్తిస్థాయి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

కాగా, ఈ కేసులో తదుపరి విచారణను వ‌చ్చే ఏడాది జనవరి 15వ తేదీకి వాయిదా వేశారు. ఇదే తరహాలో ఈ ఏడాది మే నెలలో నటుడు జాకీ ష్రాఫ్ వేసిన పిటిషన్‌పై కూడా ఢిల్లీ హైకోర్టు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.


Aishwarya Rai
Aishwarya Rai Bachchan
Delhi High Court
photo morphing
celebrity rights
personality rights
Jackie Shroff
artificial intelligence
AI morphing
defamation

More Telugu News