Presidential Election: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు ఉపయోగించరో తెలుసా?

Why EVMs are Not Used in Presidential Elections
  • ఈవీఎంలలో ఓటు వేయాలంటే పేరు పక్కన బటన్ నొక్కితే సరిపోతుంది
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేయాలి
  • ఈ భిన్న సాంకేతికత లేనందున ఈవీఎంలను ఉపయోగించరు
భారత ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు అత్యంత కీలకమైనవి. ఇప్పటివరకు 5 లోక్‌సభ, 130 అసెంబ్లీ ఎన్నికల్లో వీటిని వినియోగించారు. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం వీటిని ఉపయోగించడం లేదు. ఓట్ అగ్రిగేటర్లుగా రూపొందించడమే ఇందుకు కారణం.

దేశంలో గత రెండు దశాబ్దాలుగా ఈవీఎంలను వాడుతున్నారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో వినియోగించేందుకు అనుగుణంగా వీటిని రూపొందించారు. ఈవీఎంలలో అభ్యర్థి పేరు పక్కన ఉన్న బటన్ నొక్కితే వారికి ఓటు నమోదవుతుంది.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు మాత్రం భిన్నమైనవి. ఈ ఎన్నికలు దామాషా ప్రాతినిధ్య విధానం ప్రకారం జరుగుతాయి. వీటిలో రహస్య బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల పక్కన ఓటర్లు తమ ప్రాధాన్యాన్ని సూచిస్తూ అంకెలు వేయాలి. అక్షరాల్లో రాయకూడదు. ప్రాధాన్యత క్రమంలో 1, 2... ఇలా అంకెలు వేయాలి. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఓటర్లు తమకు నచ్చినంత వరకు ప్రాధాన్యతా అంకెలను బ్యాలెట్‌పై రాయవచ్చు.

ఓటు చెల్లుబాటు కావాలంటే మొదటి ప్రాధాన్యత అంకెను తప్పనిసరిగా వేయాలి. మిగతా ప్రాధాన్యతా అంకెలను నచ్చితే వేయవచ్చు లేదా వదిలేయవచ్చు. ఈ ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం ఓటర్లకు ప్రత్యేక పెన్నులు అందిస్తుంది. ఓటర్లు ఆ పెన్నుతోనే గుర్తులు వేయాల్సి ఉంటుంది. వేరే పెన్నును ఉపయోగిస్తే ఆ ఓటు చెల్లనిదిగా పరిగణిస్తారు.

దామాషా ప్రాతినిధ్య విధానంలో జరిగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాధాన్యత ఆధారంగా ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు ఈ విభిన్న సాంకేతికతను కలిగి లేవు. అందుకే వీటిని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉపయోగించడం లేదు.
Presidential Election
EVM
Electronic Voting Machine
India
President
Vice President
Election Commission

More Telugu News