KTR: అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఒవైసీ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు: కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

KTR Criticizes Congress Questioning Kaleshwaram Project in Assembly
  • కాళేశ్వరంపై కాంగ్రెస్‌ను నిలదీసిన కేటీఆర్.. ఒవైసీ వ్యాఖ్యల ప్రస్తావన
  • కాళేశ్వరంపై రేవంత్ ప్రభుత్వానిది రెండు నాల్కల ధోరణి అన్న కేటీఆర్
  • "కూలేశ్వరం" నీళ్లతోనే హైదరాబాద్ దాహం తీరుస్తారా? అని ఎద్దేవా
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తుండగా, ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకంలోనే 20 లక్షల ఎకరాలకు నీరు అందించినట్లు పేర్కొన్నారని అక్బరుద్దీన్ సభలో నిలదీసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.

కాళేశ్వరం బ్యారేజీ కొట్టుకుపోయిందని చేస్తున్న ప్రచారాన్ని కూడా కేటీఆర్ ఖండించారు. 12 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా బ్యారేజీ చెక్కుచెదరలేదని, అయినా 20 నెలలుగా దానికి మరమ్మతులు ఎందుకు చేయడం లేదని అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

"ఇన్ని రోజులు కాళేశ్వరాన్ని 'కూలేశ్వరం' అంటూ విమర్శించిన నోళ్లే, ఇప్పుడు అదే ప్రాజెక్టు నీటితో హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ చర్యతో కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు, కామధేనువు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా అంగీకరించినట్లేనని ఆయన అన్నారు.

గంధమల్ల రిజర్వాయర్ విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని కేటీఆర్ అన్నారు. దాన్ని పూర్తి చేస్తానని శంకుస్థాపన రోజే చెప్పారని, కానీ ఆ గంధమల్ల రిజర్వాయర్‌కు కూడా కాళేశ్వరం అనుసంధాన ప్రాజెక్టయిన కొండ పోచమ్మ సాగర్ నుంచే నీళ్లు వస్తాయన్న నిజాన్ని విస్మరించరాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మూసీ నది పునరుజ్జీవనం కార్యక్రమానికి శంకుస్థాపన మల్లన్న సాగర్ లేదా కొండపోచమ్మ సాగర్ వద్ద చేయాలని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గుండెకాయను వదిలిపెట్టి గండిపేట వద్ద చేస్తున్నారని విమర్శించారు. గండిపేటకు తెస్తున్నది కాళేశ్వరం జలాలు కాదా? అని నిలదీశారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటిని తీసుకువస్తున్నారని అన్నారు.
KTR
Kaleshwaram Project
Akbaruddin Owaisi
Revanth Reddy
BRS
Congress
Telangana
Konda Pochamma Sagar

More Telugu News