Revanth Reddy: రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ వేసిన పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు... కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Gets Relief as Supreme Court Dismisses BJP Petition
  • సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట
  • బీజేపీ వేసిన పరువునష్టం పిటిషన్ కొట్టివేత
  • రాజకీయ యుద్ధాలకు కోర్టులు వేదిక కాదన్న సుప్రీంకోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాకుండా, రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాలను వేదికగా మార్చవద్దని బీజేపీకి గట్టిగా హితవు పలికింది. కేసును కొట్టివేసిన తర్వాత కూడా వాదనలు కొనసాగించే ప్రయత్నం చేసిన బీజేపీ తరఫు న్యాయవాదిపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ.10 లక్షల జరిమానా విధిస్తామని గట్టిగా హెచ్చరించారు.

గతేడాది జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆయన చేసిన ప్రసంగం తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఆరోపిస్తూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-125 కింద కేసు విచారణ కొనసాగించవచ్చని సూచించింది.

అయితే, ట్రయల్ కోర్టు ఆదేశాలను రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. రాజకీయ నాయకుల ప్రసంగాల్లో అతిశయోక్తులు సహజమని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని స్పష్టం చేస్తూ బీజేపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో రేవంత్ రెడ్డికి పూర్తి ఊరట లభించినట్లయింది. 
Revanth Reddy
Telangana BJP
Supreme Court
Defamation Petition
Kasam Venkateshwarlu
Lok Sabha Elections 2024
Reservations
Telangana High Court
Political Speech
Court Case

More Telugu News