Tejaswi Yadav: తేజస్వి యాదవ్ భార్య 'జెర్సీ ఆవు'.. ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Tejaswi Yadav Wife Called Jersey Cow by RJD Leader
  • తీవ్రంగా స్పందించిన ఆర్జేడీ మహిళా విభాగం
  • నవాడాలో రాజ్ బల్లభ్ దిష్టిబొమ్మ దగ్ధం
  • మహిళలను అవమానిస్తే సహించబోమన్న నేతలు
బీహార్‌లో ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీని ఉద్దేశించి ఆయన చేసిన 'జెర్సీ ఆవు' వ్యాఖ్య రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

నార్దిగంజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్ బల్లభ్ మాట్లాడుతూ తేజస్వి యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. "తేజస్వి యాదవ్ మన కులం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. సమాజంలోని ఓ బిడ్డకు మేలు జరిగేది. కానీ ఆయన హర్యానా-పంజాబ్ నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చారు, అదో జెర్సీ ఆవులా ఉంది" అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ మహిళా విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నవాడాలో జిల్లా ఆర్జేడీ మహిళా విభాగం అధ్యక్షురాలు రేణు సింగ్ నేతృత్వంలో నిరసన చేపట్టారు. సద్భావనా చౌక్ వద్ద రాజ్ బల్లభ్ యాదవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా రేణు సింగ్ మాట్లాడుతూ.. "తేజస్వి భార్య రాజశ్రీని జెర్సీ ఆవు అని పిలవడం ద్వారా రాజ్ బల్లభ్ యాదవ్ కేవలం ఆమెను మాత్రమే కాదు, యావత్ మహిళా లోకాన్నే అవమానించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం" అని హెచ్చరించారు. "మహిళల పట్ల అవమానాలను భారతదేశం సహించదు" అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.

గతంలో ఆర్జేడీలో ఉన్న రాజ్ బల్లభ్ యాదవ్‌కు వివాదాస్పద చరిత్ర ఉంది. 2016లో బాలికపై అత్యాచారం కేసులో ఆయన జైలుకు వెళ్లారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, ఇటీవలే పట్నా హైకోర్టు ఈ కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ యాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లిపై కాంగ్రెస్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన మరువకముందే ఈ వివాదం తెరపైకి రావడం గమనార్హం.
Tejaswi Yadav
Raj Ballabh Yadav
Rajshree Yadav
RJD
Bihar Politics
Jersey Cow Remark
Haryana
Nawada
Renu Singh
Controversial Statement

More Telugu News