Sudarshan Reddy: రేపే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఫలితం వెల్లడయ్యేది కూడా రేపే!

Inida Vice President election tomorrow
  • ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్
  • విపక్షాల నుంచి జస్టిస్ సుదర్శన్‌ రెడ్డి పోటీ
  • పార్లమెంటులో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్
దేశ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. రేపు పార్లమెంటు భవనంలో జరగనున్న ఈ ఎన్నికల పోలింగ్‌లో ఎన్‌డీఏ అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు, విపక్ష ‘ఇండియా’ కూటమి ఉమ్మడి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డికి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, అదే రోజు సాయంత్రం ఫలితం వెల్లడవుతుంది.

గెలుపుపై ధీమాతో ఉన్నప్పటికీ, ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతాయేమోనన్న ఆందోళన రెండు కూటముల్లోనూ కనిపిస్తోంది. 2022 ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లకుండా పోవడంతో ఈసారి పార్టీలు మరింత జాగ్రత్త పడుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ తమ ఎంపీల కోసం ఆది, సోమవారాల్లో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యాహ్నం మాక్ పోలింగ్ ద్వారా తమ ఎంపీలకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పిస్తోంది. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు.

సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభల్లోని 781 మంది సభ్యుల్లో ఎన్‌డీఏకు 425 మంది బలం ఉండగా, ‘ఇండియా’ కూటమికి 311 మంది సభ్యులున్నారు. వైసీపీ ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది. బీజేడీ మద్దతు కోసం ప్రధాని మోదీ ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్‌తో స్వయంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ తమ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

సంఖ్యాబలం తమకు అనుకూలంగా లేకపోయినా, రహస్య బ్యాలెట్ ఓటింగ్ కావడంతో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని విపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు, తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌కు ఆ రాష్ట్ర ఎంపీల నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో, తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, రాజకీయాలకు అతీతంగా తనను గెలిపించాలని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎంపీలందరికీ లేఖ రాశారు.

రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు భవనంలోని వసుధ కాంప్లెక్స్‌లో పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 6 గంటలకు చేపట్టి ఫలితాన్ని వెల్లడిస్తారు. 
Sudarshan Reddy
Vice President Election
India Alliance
NDA
Parliament
Voting
Rajya Sabha
Venkaiah Naidu
Margret Alva
BJD

More Telugu News