US Open 2025: యూఎస్ ఓపెన్‌లో ఆసక్తికర ఘటన.. అల్కరాజ్ విజయంపై ట్రంప్ రియాక్షన్ వైరల్!

Carlos Alcaraz Victory at US Open Trump Reaction Goes Viral
  • యూఎస్ ఓపెన్ 2025 విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్
  • ఫైనల్‌లో ఇటలీ ఆటగాడు జానిక్ సిన్నర్‌పై విజయం
  • అల్కరాజ్ గెలుపుపై ట్రంప్ స్పందన సోషల్ మీడియాలో వైరల్
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో గంటకు పైగా ఆలస్యమైన మ్యాచ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో దాదాపు గంటకు పైగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైనప్పటికీ, స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఏమాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. యూఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రెండోసారి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ఇటలీ ఆటగాడు జానిక్ సిన్నర్‌పై 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో అల్కరాజ్ ఘనవిజయం సాధించాడు. ఇది అతనికి ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.

ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆర్థర్ ఆష్ స్టేడియానికి వస్తారని ముందుగానే ప్రకటించారు. ఆయన రాక సందర్భంగా తీసుకున్న కట్టుదిట్టమైన భద్రతా చర్యల కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైంది. మ్యాచ్‌కు ముందు స్టేడియంలో కనిపించిన ట్రంప్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు చప్పట్లతో స్వాగతం పలకగా, మరికొందరు నిరసన వ్యక్తం చేశారు. అయితే, అల్కరాజ్ విజయం సాధించిన తర్వాత ట్రంప్ నిర్లక్ష్యంగా స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయ‌న రియాక్ష‌న్ తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఇక‌, ఈ విజయంతో అల్కరాజ్.. జానిక్ సిన్నర్‌ను వెనక్కి నెట్టి మళ్లీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. సెప్టెంబర్ 2023 తర్వాత అతను అగ్రస్థానానికి రావడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, హార్డ్ కోర్ట్ గ్రాండ్‌స్లామ్‌లలో సిన్నర్ 27 మ్యాచ్‌ల విజయపరంపరకు అల్కరాజ్ అడ్డుకట్ట వేశాడు.

విజయం అనంతరం అల్కరాజ్ మాట్లాడుతూ, “ఈ ట్రోఫీని గెలవడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఇది నాకు రెండో టైటిల్. నంబర్ వన్ ర్యాంకును తిరిగి పొందడం నా తొలి లక్ష్యాల్లో ఒకటి” అని చెప్పాడు.

ఓటమిపై సిన్నర్ స్పందిస్తూ, “ఈ రోజు నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాను. ఇంతకంటే ఎక్కువ చేయలేకపోయాను. అతను (అల్కరాజ్) కీలక సమయాల్లో తన ఆట స్థాయిని పెంచాడు. నా కంటే అద్భుతంగా ఆడాడు” అని తెలిపాడు.
US Open 2025
Carlos Alcaraz
Donald Trump
Jannik Sinner
tennis
grand slam
world number one
sports
Arthur Ashe Stadium
tennis finals

More Telugu News