Chandrababu Naidu: సమాజానికి సంపద సృష్టించి సేవలందించండి .. యువ పారిశ్రామిక వేత్తలతో ఏపీ సీఎం చంద్రబాబు మాటా మంతి

Chandrababu Naidu Calls for Wealth Creation and Service to Society
  • అంతర్జాతీయ బ్రాండ్‌గా మన ఉత్పత్తులు తయారు కావాలన్న సీఎం చంద్రబాబు
  • ఏ పరిశ్రమకైనా.. వ్యాపారానికైనా విశ్వసనీయతే ముఖ్యమన్న చంద్రబాబు
  • సమీప భవిష్యత్తులో అమరావతి- హైదరాబాద్- బెంగుళూరు- చెన్నై అతిపెద్ద కారిడార్‌గా మారుతుందన్న సీఎం చంద్రబాబు
  • యువ పారిశ్రామిక వేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని పిలుపు
పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్‌లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు. నిన్న తన క్యాంపు కార్యాలయంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. విశాఖ-చెన్నై మధ్య నాలుగు లేన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత పరిస్థితి పూర్తిగా మారుతుందని అన్నారు.

సమీప భవిష్యత్తులో అమరావతి-హైదరాబాద్-బెంగళూరు-చెన్నై అతిపెద్ద కారిడార్‌గా మారుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కారిడార్ ఏర్పాటు కానుందని, అలాగే విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని సీఎం తెలిపారు. వివిధ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను తయారు చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 శాతం పచ్చదనాన్ని 50 శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా దేశాల పేర్లను సూచించేలా పార్కులతో సుందరీకరణ చేపడుతున్నట్టు వెల్లడించారు.

ఆంధ్రాప్రెన్యూర్స్ పేరు నిలబెట్టండి

యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం నడుపుతున్న సంస్థలను మరింత వృద్ధిలోకి తేవాలని.. ఆంధ్రా ప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వం రూపొందిస్తున్న పాలసీలను వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయికి తమ సంస్థలను తీసుకెళ్లాలని సీఎం అన్నారు. ఏ పరిశ్రమకైనా, వ్యాపారానికైనా విశ్వసనీయతే ముఖ్యమని దానిని నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో పారిశ్రామిక ఎకో సిస్టంను కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
Entrepreneurs Organization
Industrial Development
Amaravati
Visakhapatnam
Nara Lokesh
Green Energy Corridor
AP Industrial Policy

More Telugu News