Pattabhi Ram: 17 మెడికల్ కాలేజీలంటూ జగన్ చేస్తున్న ప్రచారంలో నిజంలేదు: పట్టాభి

Pattabhi Ram Criticizes Jagans Medical College Claims
  • ఐదేళ్లలో జగన్ కట్టింది 5, అవీ అసంపూర్తిగానే వదిలేశారని పట్టాభి విమర్శ
  • ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా తెచ్చిందీ జగనేనని ఆరోపణ
  • ఎన్‌ఎంసీ నిబంధనలు గాలికొదిలేశారని గత ప్రభుత్వంపై ఫైర్
  • పీపీపీ పద్ధతిలో 10 కొత్త కాలేజీలు కడుతున్నామని స్పష్టీకరణ
  • అసంపూర్తిగా ఉన్న కాలేజీలను వేగంగా పూర్తి చేస్తామని వెల్లడి
గత వైసీపీ ప్రభుత్వం వైద్య విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, 17 మెడికల్ కాలేజీలు నిర్మించామంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా విమర్శించారు. తన ఐదేళ్ల పాలనలో కేవలం ఐదు కాలేజీల (విజయనగరం, మచిలీపట్టణం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల) నిర్మాణాన్ని ప్రారంభించి, వాటిని కూడా అసంపూర్తిగా వదిలేశారని ఆయన ఆరోపించారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ తన అవినీతి, నిర్లక్ష్యంతో రాష్ట్ర వైద్య వ్యవస్థను భ్రష్టుపట్టించారని, దాని పర్యవసానాలను కరోనా సమయంలో ప్రజలు కళ్లారా చూశారని అన్నారు.

గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల కోసం రూ.8,480 కోట్లు అంచనా వేసిందని, కానీ ఖర్చు చేసింది కేవలం రూ.1,451 కోట్లు మాత్రమేనని పట్టాభిరామ్ లెక్కలతో సహా వివరించారు. ఇందులోనూ రూ.975 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులేనని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు ఇచ్చినా, జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి రూ.168 కోట్ల పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఎత్తిచూపారు. 

జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలను గాలికొదిలేశారని, పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల వంటి కాలేజీలలో కనీస సౌకర్యాలు, అధ్యాపకుల కొరతపై ఎన్‌ఎంసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. జగన్ సొంత నియోజకవర్గంలోనే 40 శాతం అధ్యాపకుల కొరత ఉందని ఎన్‌ఎంసీ నివేదిక ఇచ్చిందని తెలిపారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలలోనే ‘సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్షియల్’ మోడల్ పేరుతో మేనేజ్‌మెంట్ కోటాను ప్రవేశపెట్టింది జగన్ కాదా అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. జీవో నెంబర్ 133, 107, 108 ద్వారా ప్రభుత్వ కాలేజీలలో కన్వీనర్ కోటా సీట్లను తగ్గించి, సెల్ఫ్-ఫైనాన్సింగ్ సీట్లకు రూ.12 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటాకు రూ.20 లక్షల వరకు ఫీజులు నిర్ణయించి వైద్య విద్యను పేదలకు దూరం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని గాడిన పెట్టేందుకు కృషి చేస్తోందని పట్టాభిరామ్ అన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని కాలేజీల పనులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో లాభాపేక్ష లేని చారిటబుల్ ట్రస్టులు లేదా సెక్షన్ 8 కంపెనీల ద్వారా మరో 10 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇది ప్రైవేటీకరణ కాదని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకేనని తెలిపారు. 

చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో 22 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని, ఆయన నాయకత్వంలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఎయిమ్స్, బర్డ్ ఆస్పత్రి వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు వచ్చాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో పేదలకు ఉచిత వైద్యం, యువతకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
Pattabhi Ram
Andhra Pradesh
Medical Colleges
Jagan Mohan Reddy
TDP
Healthcare
Medical Education
Chandrababu Naidu
NMC
Corruption

More Telugu News