Suravaram Sudhakar Reddy: చంద్రబాబుతో సురవరానికి రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ... మంచి స్నేహం ఉండేది: సీపీఐ నారాయణ

CPI Narayana recalls Suravarams friendship with Chandrababu despite political differences
  • కర్నూలులో సురవరం సంస్మరణ సభ
  • రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టాయన్న నారాయణ
  • అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలను పట్టించుకోవడం లేదని విమర్శ
ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని, ఇందులో కచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. అధికారంలోకి రాకముందు పార్టీలు గొప్పగా మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయని, కానీ గద్దెనెక్కాక వాటిని పూర్తిగా పక్కనపెడుతున్నాయని ఆయన విమర్శించారు.

కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలతో కూడిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక ప్రతి పార్టీ పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సురవరం సుధాకర్‌రెడ్డికి కర్నూలు జిల్లాతో విడదీయరాని బంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయనకు రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం ఉండేదని నారాయణ వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తనకు కమ్యూనిస్టు నాయకులను చూస్తే భయం వేసేదని, కానీ సుధాకర్‌రెడ్డిని చూస్తే మాత్రం అలాంటి భయం ఎప్పుడూ కలగలేదని అన్నారు.

ఈ సంస్మరణ సభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ తదితర నేతలు పాల్గొని సురవరం సుధాకర్‌రెడ్డికి నివాళులర్పించారు.
Suravaram Sudhakar Reddy
CPI Narayana
Chandrababu Naidu
TG Venkatesh
Kurnool
CPI
Political News
Andhra Pradesh Politics
Goura Charitha
SV Mohan Reddy

More Telugu News