Ram Gopal Varma: టీచర్స్ డే రోజున ఆర్జీవీ కొత్త వివాదం.. వర్మపై నెటిజన్ల ఫైర్

Ram Gopal Varma Teachers Day Controversy Over Dawood Ibrahim
  • 'ఎక్స్' వేదిక‌గా తనకు స్ఫూర్తినిచ్చిన గురువుల జాబితా వెల్లడించి వ‌ర్మ‌
  • అమితాబ్, స్పీల్‌బర్గ్‌లతో పాటు దావూద్ ఇబ్రహీం పేరును చేర్చిన వైనం
  • మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను గురువుగా పేర్కొనడంపై తీవ్ర దుమారం
  • ఆర్జీవీ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం
  • ఉగ్రవాదిని కీర్తించడం సరికాదంటూ తీవ్ర విమర్శలు
వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఉపాధ్యాయ దినోత్సవం నాడు మరోసారి తీవ్ర దుమారం రేపారు. తనకు స్ఫూర్తినిచ్చిన గురువుల జాబితాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం పేరును చేర్చడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే.. శుక్రవారం (సెప్టెంబర్ 5) టీచర్స్ డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు. “నేను దర్శకుడిగా మారడానికి, నా జీవితంలో నాకు నచ్చింది చేయడానికి నన్ను ప్రేరేపించిన గొప్ప వ్యక్తులందరికీ ఇదే నా సెల్యూట్. నాకు స్ఫూర్తిగా నిలిచిన అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, అయాన్ రాండ్, బ్రూస్ లీ, శ్రీదేవి, దావూద్ ఇబ్రహీంలకు టీచర్స్ డే శుభాకాంక్షలు” అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదిని, లెజెండరీ నటులు, దర్శకులతో పోలుస్తూ గురువుగా పేర్కొనడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఒక నేరస్థుడిని గురువుగా కీర్తించడం సిగ్గుచేటని, వర్మ తీరు అభ్యంతరకరంగా ఉందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తూ తమ నిరసనను తెలుపుతున్నారు. తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ, ఈసారి ఏకంగా దావూద్ పేరును ప్రస్తావించి మరో పెద్ద వివాదానికి తెరలేపారు.
Ram Gopal Varma
RGV
Teachers Day
Dawood Ibrahim
Controversy
Amitabh Bachchan
Steven Spielberg
Sridevi
Twitter
Social Media

More Telugu News