Nag Ashwin: ప్రధాని నరేంద్ర మోదీకి దర్శకుడు నాగ్ అశ్విన్ విజ్ఞప్తి

Nag Ashwin Requests PM Modi Regarding GST on Movie Tickets
  • ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ మార్పులు
  • జీఎస్టీ సంస్కరణలు స్వాగతిస్తున్నానన్న దర్శకుడు నాగ్ అశ్విన్
  • రూ.250ల లోపు సినిమా టికెట్లకు జీఎస్టీ తగ్గించడం ఎంతో అవసరమన్న నాగ్ అశ్విన్
జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. జీఎస్టీ సంస్కరణలు సరైన దిశగా అడుగులేనని పేర్కొన్న ఆయన.. మరింత మెరుగైన పరిష్కారాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు.
 
తాజా మార్పుల ప్రకారం.. రూ.100 లోపు సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ నిర్ణయం తక్కువ థియేటర్లకే వర్తించనున్నదని నాగ్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డారు. ‘రూ.100 లోపు టికెట్లతో పనిచేస్తున్న థియేటర్లు చాలా తక్కువ. ప్రజలకు నిజమైన లాభం చేకూరాలంటే, రూ.250 లోపు టికెట్లకూ 5 శాతం జీఎస్టీ వర్తింపజేయాలి’ అని ట్వీట్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. 
 
ఈ సూచనతో మధ్య తరగతి ప్రేక్షకులకు మరింత ఆర్ధిక ఊరట లభిస్తుందని, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరగడమే కాకుండా, ఇండస్ట్రీ అభివృద్ధికి ఇది తోడ్పడుతుందన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికే కష్టాల్లో ఉన్న నేపథ్యంలో, ఈ మార్పులు వారికి మరింత ఊరటనిచ్చే అవకాశముందని తెలిపారు.
 
మరోవైపు, జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కూడా స్పందించారు. సినిమా ప్రొడక్షన్ సేవలను 18 శాతం జీఎస్టీ శ్లాబ్ పరిధిలోకి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, పన్నుల తగ్గింపుతో పర్యాటక, సినిమా రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
 
జీఎస్టీ మార్పులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
Nag Ashwin
Narendra Modi
GST
Tollywood
Indian Cinema
Movie Tickets
Tax Slab
Kandula Durgesh
Andhra Pradesh
Single Screen Theaters

More Telugu News