Patibandla Lokesh: అమెరికాలో ఏపీ యువకుడు మృతి

Patibandla Lokesh AP Youth Dies in US Drowning Accident
  • అమెరికాలోని బోస్టన్‌లో బాపట్ల జిల్లా యువకుడి మృతి
  • స్విమ్మింగ్ పూల్ లో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన లోకేశ్
  • ఎనిమిది నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన యువకుడు
ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో యువకుడి జీవితం విషాదాంతమైంది. బాపట్ల జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల లోకేశ్ (25) బోస్టన్ నగరంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలియడంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే, ఈ నెల 3వ తేదీన లోకేశ్ తన స్నేహితులతో కలిసి సరదాగా స్విమ్మింగ్ పూల్ కు వెళ్లాడు. ఈ క్రమంలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గురువారం రాత్రి అతడి స్నేహితులు మార్టూరులోని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.

మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి పాటిబండ్ల వేణుబాబు, శాంతి దంపతుల కుమారుడు లోకేశ్. ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన అతడు, అక్కడ ఎంఎస్ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తర్వాత సుమారు ఎనిమిది నెలల క్రితమే బోస్టన్‌లో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

లోకేశ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా మార్టూరుకు తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అమెరికాలో తెలుగు యువకులు వరుసగా మరణిస్తుండటం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 
Patibandla Lokesh
AP youth in USA
Andhra Pradesh
Bapatla district
Marturu village
Boston
Drowning accident
Telugu student USA
MS graduate
Indian student death

More Telugu News