Elon Musk: ట్రంప్ పిలిచాడు, కానీ నేనే వెళ్లలేదు: ఎలాన్ మస్క్

Elon Musk explains absence from Donald Trump tech giants meeting
  • టెక్ దిగ్గజాలతో ట్రంప్ భేటీపై స్పందించిన స్పేస్ ఎక్స్ అధినేత
  • తన బదులుగా ప్రతినిధిని పంపించినట్లు వెల్లడి
  • ఆహ్వానితుల జాబితాలో మస్క్ పేరు లేదన్న రాయిటర్స్ సంస్థ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం టెక్ దిగ్గజాలతో సమావేశమైన విషయం విదితమే. ఈ సమావేశానికి ట్రంప్ మాజీ సహచరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ హాజరు కాలేదు. దీనిపై మీడియాలో చర్చ జరుగుతుండటంతో మస్క్ తాజాగా స్పందించారు. ఆ సమావేశానికి ప్రెసిడెంట్ ట్రంప్ యంత్రాంగం నుంచి తనకు ఆహ్వానం అందిందని ఆయన పేర్కొన్నారు. అయితే, అనివార్య కారణాల వల్ల తాను వెళ్లలేకపోయానని వివరణ ఇచ్చారు. తనకు బదులుగా తన కంపెనీ నుంచి ఓ ప్రతినిధిని పంపించానని మస్క్ తెలిపారు.

ట్రంప్ సమావేశంపై రాయిటర్స్ సంస్థ ఓ కథనం ప్రసారం చేస్తూ.. ఈ మీటింగ్ కు ట్రంప్ యంత్రాంగం ఎలాన్ మస్క్ కు ఆహ్వానం పంపలేదని పేర్కొంది. ఆహ్వానితుల జాబితాలో మస్క్ పేరు లేదని తెలిపింది. మస్క్ తాజా వివరణ నేపథ్యంలో టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల తరఫున ఎవరైనా హాజరై ఉండొచ్చని పేర్కొంది. అయితే, మస్క్ ప్రతినిధి హాజరుపై అటు ట్రంప్ యంత్రాంగం కానీ, ఇటు మీడియా సంస్థలు కానీ ఎలాంటి నిర్ధారణ ప్రకటన చేయకపోవడం గమనార్హం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ గెలుపు కోసం మస్క్ నిధులు సమకూర్చడంతో పాటు ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ట్రంప్ రెండో పర్యాయం అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి మస్క్ కృషి కూడా తోడయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మస్క్ చురుగ్గా వ్యవహరించారు. ట్రంప్ ప్రభుత్వ సలహాదారుగా సేవలందించిన మస్క్... ట్రంప్ తో విభేదాల కారణంగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇటీవలి కాలంలో ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజాలతో ట్రంప్ సమావేశం కావడం, ఈ సమావేశానికి మస్క్ హాజరుకాకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
Elon Musk
Donald Trump
Trump meeting
SpaceX
Tesla
US Presidential Elections
Tech giants meeting
Trump administration
Elon Musk Trump
US Politics

More Telugu News