Harish Rao: రేవంత్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడ్డ హరీశ్ రావు

Harish Rao Criticizes Revanth Reddy Government from London
  • మేడిగడ్డ మూడు పిల్లర్లకే కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని హరీశ్ విమర్శ
  • ఏడాదిన్నరగా ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీత
  • హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని ఆరోపణ
తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై లండన్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజీలోని కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే, దానిని పట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఈరోజు లండన్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

వానాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుందని, ఆ సమయంలో 'బాహుబలి' మోటార్లతో సులభంగా నీటిని ఎత్తిపోసుకోవచ్చని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్ పాలన కారణంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలు ముందుకు రావడం లేదని అన్నారు.

ఈ సందర్భంగా పార్టీ గురించి మాట్లాడుతూ, బీఆర్ఎస్‌కు అధినేత కేసీఆరే సర్వస్వం అని హరీశ్ స్పష్టం చేశారు. ఏ విషయంలోనైనా పార్టీదే తుది నిర్ణయమని తేల్చిచెప్పారు. ప్రజలకు సేవ చేయడం ఎలాగో తనకు కేసీఆర్ నేర్పించారని ఆయన పేర్కొన్నారు.

Harish Rao
Revanth Reddy
Telangana
Medigadda Barrage
BRS
London
KCR
Telangana Politics
Real Estate Hyderabad
Telangana Government

More Telugu News