Vladimir Putin: భారత్‌కు అండగా రష్యా.. అమెరికాపై పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Putin supports India against US tariffs
  • భారత్, చైనాలపై అమెరికా సుంకాల విధింపుపై పుతిన్ ఆగ్రహం
  • ఆసియా శక్తులను ట్రంప్ అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శ
  • ఆర్థిక ఒత్తిడిని ఒక ఆయుధంగా వాడుతున్నారని ఆరోపణ
భారత్‌, చైనా వంటి దేశాలపై అమెరికా అనుసరిస్తున్న తీరును రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. భారీ సుంకాలతో ఆ దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలని చూడటం సరికాదని ఆయన విమర్శించారు. అమెరికాతో సుంకాల వివాదం నడుస్తున్న వేళ, భారత్‌కు మద్దతుగా పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చైనా పర్యటనలో ఉన్న పుతిన్, ఎస్‌సీవో సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసియాలోని రెండు అతిపెద్ద శక్తులైన భారత్, చైనాలను అణగదొక్కేందుకు ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఒక ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలహీనపరిచేందుకే అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు.

"భారత్, చైనాలు దాదాపు 150 కోట్ల జనాభా చొప్పున, శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నాయి. వాటికంటూ ప్రత్యేక రాజకీయ వ్యవస్థలు, చట్టాలు ఉన్నాయి. అలాంటి దేశాలను టారిఫ్‌లతో శిక్షించాలని చూస్తే, అక్కడి నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. వారి చరిత్రలో వలసవాదం వంటి కష్టకాలం ఉంది. సుదీర్ఘకాలం వారి సార్వభౌమత్వంపై పన్నులు విధించారు. ఆ రోజులు పోయాయి. ఇప్పటికీ వారిని అణగదొక్కాలని మాట్లాడటం సరికాదు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు వాడాలి" అని పుతిన్ స్పష్టం చేశారు.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ట్రంప్ ప్రభుత్వం భారీగా సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌పై అమెరికాలోని కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్, భారత్‌పై విధించింది కేవలం ద్వితీయ శ్రేణి సుంకాలేనని, ఇంకా రెండు, మూడు దశలు మిగిలి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో, ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు వసూలు చేసేది భారతేనని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగవని, త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Vladimir Putin
Russia
India
America
China
Tariffs
SCO Summit
Economic pressure
Trump
International relations

More Telugu News