WHO: మానసిక సంక్షోభంలో ప్రపంచం.. ప్రతి ఏడుగురిలో ఒకరికి సమస్య.. డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ రిపోర్ట్!

WHO Shocking Report Mental Health Crisis Worldwide
  • ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్నారన్న డబ్ల్యూహెచ్‌వో
  • కుంగుబాటు, ఆందోళన కేసులే మూడింట రెండొంతులు ఉన్నాయని వెల్లడి
  • యువత మరణాలకు ఆత్మహత్యలే ప్రధాన కారణమన్న ఆరోగ్య సంస్థ
  • ప్రతి 100 మరణాల్లో ఒకటి ఆత్మహత్యేనని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సంక్షోభం ప్రమాదకర స్థాయికి చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ జనాభాలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ సమస్య వల్ల తీవ్ర ప్రాణ, ఆర్థిక నష్టం వాటిల్లుతోందని హెచ్చరించింది.

2021 నాటి గణాంకాలతో 'వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే', 'మెంటల్ హెల్త్ అట్లాస్-2024' పేరిట డబ్ల్యూహెచ్‌వో రెండు నివేదికలను విడుదల చేసింది. మొత్తం మానసిక సమస్యల్లో మూడింట రెండొంతుల కేసులు కుంగుబాటు (డిప్రెషన్), మానసిక ఆందోళనవే కావడం గమనార్హం. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. యువత మరణాలకు ఆత్మహత్యలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి 100 మరణాల్లో ఒకటి ఆత్మహత్యేనని, ప్రతి 20 ఆత్మహత్యాయత్నాలకు ఒక మరణం సంభవిస్తోందని పేర్కొంది.

ఇతర తీవ్రమైన రుగ్మతల గురించి కూడా నివేదిక ప్రస్తావించింది. ప్రతి 200 మందిలో ఒకరు స్కిజోఫ్రెనియాతో, ప్రతి 150 మందిలో ఒకరు బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని తెలిపింది. స్కిజోఫ్రెనియా చికిత్స అత్యంత ఖరీదైనదిగా మారుతూ ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తోందని వివరించింది.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మానసిక రోగులకు వైద్య సేవలు అందించేందుకు నిపుణుల కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. ప్రతి లక్ష మంది బాధితులకు కేవలం 13 మంది మానసిక ఆరోగ్య సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారని పేర్కొంది. చాలా దేశాలు తమ ఆరోగ్య బడ్జెట్‌లో కేవలం 2 శాతం నిధులను మాత్రమే మానసిక ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నాయని, 2017 నుంచి ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం విచారకరమని తెలిపింది.

ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ "మానసిక ఆరోగ్యంపై పెట్టే ఖర్చును ప్రజలపై పెడుతున్న పెట్టుబడిగా చూడాలి. ప్రతి దేశం, ప్రతి నాయకుడు ఈ అంశంపై తక్షణమే దృష్టి సారించాలి. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు" అని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.
WHO
World Health Organization
mental health
depression
suicide
anxiety
schizophrenia
bipolar disorder
mental health crisis
Tedros Adhanom

More Telugu News