Virat Kohli: సంతోషకరమైన క్షణం.. విషాదంగా మారింది: తొక్కిసలాట ఘటనపై కోహ్లీ భావోద్వేగం

Nothing in life prepares you for a heartbreak like June 4 Kohli on Bengaluru stampede
  • ఆర్‌సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాటపై స్పందించిన విరాట్ కోహ్లీ
  • జూన్ 4 ఘటన జీవితంలో మర్చిపోలేనిదని భావోద్వేగ ప్రకటన
  • బాధిత కుటుంబాలకు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ రూ. 25 లక్షల పరిహారం
  • 'ఆర్‌సీబీ కేర్స్' పేరుతో అభిమానుల కోసం కొత్త కార్యక్రమం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించాడు. ఈ సంద‌ర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. జూన్ 4న జరిగిన ఈ దుర్ఘటన జీవితంలో మర్చిపోలేనిదని, ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన రోజు విషాదంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆర్‌సీబీ అధికారిక వెబ్‌సైట్‌లో విరాట్‌ ఒక ప్రకటన విడుదల చేశాడు.

"జూన్ 4న జరిగిన ఘటన లాంటి హృదయవిదారక సంఘటనకు మానసికంగా సిద్ధమవడం ఎవరికీ సాధ్యం కాదు. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే గొప్పగా నిలవాల్సిన క్షణం, విషాదంగా ముగిసింది. ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం, గాయపడిన అభిమానుల కోసం నేను ప్రార్థిస్తున్నాను. వారి నష్టం ఇప్పుడు మా కథలో ఒక భాగం. మేమంతా కలిసి బాధ్యతతో, గౌరవంతో ముందుకు సాగుతాం" అని కోహ్లీ తన ప్రకటనలో పేర్కొన్నాడు.

ఈ ఏడాది ఆర్‌సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఆర్‌సీబీ యాజమాన్యం, మృతుల కుటుంబాలకు అండగా నిలిచింది. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. అంతేకాకుండా, 'ఆర్‌సీబీ కేర్స్' పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా తమ అభిమానులకు మద్దతుగా నిలుస్తామని, వారికి సాధికారత కల్పిస్తామని హామీ ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఐపీఎల్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ)తో కలిసి పటిష్ఠ‌మైన జన నియంత్రణ ప్రమాణాలను రూపొందిస్తామని తెలిపింది.

మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ జాన్ మైఖేల్ డి కున్హా కమిషన్ తన నివేదికను సమర్పించింది. చిన్నస్వామి స్టేడియం నిర్మాణం, దాని డిజైన్ భారీ జనసమూహాలను నిర్వహించడానికి ఏమాత్రం సురక్షితం కాదని, అనువుగా లేదని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదిక తీవ్ర పరిణామాలకు దారితీసింది. కమిషన్ నివేదిక ఆధారంగా 2025లో జరగనున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ వేదికల జాబితా నుంచి బెంగళూరును తొలగించారు. ఆ స్థానంలో నవీ ముంబైకి మ్యాచ్‌లను కేటాయిస్తున్నట్లు ఐసీసీ సవరించిన షెడ్యూల్‌లో ప్రకటించింది.
Virat Kohli
RCB
Royal Challengers Bangalore
IPL
stampede
tragedy
Chinnaswamy Stadium
ICC Women's World Cup
Karnataka
RCB Cares

More Telugu News