Kavitha: 'దేవనపల్లి కవిత వర్గం' అంటూ బీఆర్ఎస్ ఎక్స్ ఖాతా ట్వీట్

Kavitha Called Devanapalli Kavitha by BRS After Suspension
  • బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్
  • సోషల్ మీడియాలో ఆమెను అన్‌ఫాలో చేస్తున్న కార్యకర్తలు
  • కవిత ఇంటిపేరుపై మొదలైన కొత్త వివాదం
  • కల్వకుంట్ల బదులు దేవనపల్లి కవితగా ప్రస్తావన
  • ఆమె వర్గం ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తోందని ఆరోపణ
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌కు గురైన తర్వాత పార్టీలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ శ్రేణులు ఇప్పుడు ఒక కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాయి. ఇప్పటివరకు 'కల్వకుంట్ల కవిత'గా ఉన్న ఆమెను... ఆమె భర్త ఇంటిపేరైన 'దేవనపల్లి కవిత'గా పిలవడం మొదలుపెట్టారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే కారణంతో కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ఆమెపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆమె దిష్టిబొమ్మలను దహనం చేయడమే కాకుండా, పార్టీ కార్యాలయాల్లోని ఆమె పోస్టర్లు, బ్యానర్లను తొలగించారు. అదే సమయంలో ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో ఆమెను పెద్ద ఎత్తున అన్‌ఫాలో చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆమె ఇంటిపేరు వివాదం ముదిరింది. 'కల్వకుంట్ల' అనే ఇంటిపేరును వాడటానికి కవితకు అర్హత లేదని, ఆమెను 'దేవనపల్లి కవిత'గానే పిలవాలంటూ కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఈ వివాదానికి మరింత బలం చేకూరుస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ‘బీఆర్ఎస్ పార్టీ న్యూస్’ అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుంచి ఒక పోస్ట్ రావడం కలకలం రేపింది. "ఇన్ని రోజులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఫేక్ న్యూస్ బెడద ఉండేది. ఇప్పుడు కొత్తగా దేవనపల్లి కవిత వర్గం నుంచి ఫేక్ సమస్య మొదలైంది. ఐదేళ్ల క్రితం తెలంగాణ భవన్‌లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వీడియోను ఇప్పుడు జరిగింది అంటూ జాగృతి అల్లరి మూకలు ప్రచారం చేస్తున్నాయి" అని ఆ ట్వీట్‌లో ఆరోపించారు. పార్టీకి సంబంధించిన అధికారిక ఖాతానే ఆమెను 'దేవనపల్లి కవిత వర్గం' అని సంబోధించడం, ఆమెకు, పార్టీకి మధ్య దూరం ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తోంది. ఈ పరిణామంతో కవిత వర్సెస్ బీఆర్ఎస్ పోరు మరింత తీవ్రరూపం దాల్చినట్లయింది. 
Kavitha
Kalvakuntla Kavitha
Devanapalli Kavitha
BRS Party
BRS News
Telangana Bhavan
Fake News
BRS Suspension
Telangana Politics

More Telugu News