Robin Uthappa: రాయుడి కోసం మాట్లాడి తప్పుచేశా.. కోహ్లీతో బంధం దెబ్బతింది: రాబిన్ ఊతప్ప

Robin Uthappa Reveals Chat With Virat Kohli On Ambati Rayudu Row
  • 2019 ప్రపంచకప్ వివాదంపై నోరువిప్పిన మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప
  • రాయుడి ఎంపిక విషయంలో కోహ్లీ కెప్టెన్సీపై బహిరంగంగా విమర్శలు
  • ఆ వ్యాఖ్యల వల్లే కోహ్లీతో తన స్నేహబంధం దెబ్బతిందన్న ఊత‌ప్ప‌
  • మీడియాలో మాట్లాడే ముందు కోహ్లీతో వ్యక్తిగతంగా చర్చించి వుండాల్సిందని అభిప్రాయం 
  • స్నేహితుడికి జరిగిన అన్యాయం గురించే మాట్లాడానని స్పష్టీక‌ర‌ణ‌
టీమిండియా మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప సంచలన విషయాలు వెల్లడించారు. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోకపోవడంపై విరాట్ కోహ్లీ కెప్టెన్సీని విమర్శించడం తన వ్యక్తిగత సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిందని అంగీకరించాడు. ఆ ఒక్క ఇంటర్వ్యూ కారణంగా కోహ్లీతో తన స్నేహబంధం దెబ్బతిన్నదని తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో తెలిపాడు.

2019లో తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూను గుర్తుచేసుకుంటూ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పిన విషయాలు నిజమని నమ్మినప్పటికీ, వాటిని బహిరంగంగా మాట్లాడే ముందు విరాట్‌తో వ్యక్తిగతంగా చర్చించి ఉండాల్సింది. ఆ వ్యాఖ్యల తర్వాత కోహ్లీతో నా స్నేహంలో మార్పు వచ్చింది. ఈ విషయంపై తర్వాత అతనితో మాట్లాడినప్పుడు నా తప్పును అంగీకరించాను" అని ఊతప్ప వివరించాడు.

అయితే, ఆ ఇంటర్వ్యూలో తాను విరాట్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోలేదని ఊతప్ప స్పష్టం చేశాడు. "నేను నా అనుభవం గురించి చెప్పలేదు. నా అత్యంత సన్నిహితుడైన స్నేహితుడికి (అంబటి రాయుడు) అతని నాయకత్వంలో ఎదురైన అనుభవం గురించే మాట్లాడాను. అది కూడా అతని నాయకత్వాన్ని కాదు, నాయకత్వ శైలిని మాత్రమే ఉద్దేశించి అన్నాను. ప్రతి ఒక్కరికీ వారి సొంత నాయకత్వ శైలి, అభిప్రాయాలు ఉంటాయి. ఒకే క్రీడా రంగంలో ఉన్నప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలనే సున్నితమైన విషయాన్ని నేను ఆ ఘటన ద్వారా నేర్చుకున్నాను" అని ఆయన చెప్పుకొచ్చాడు.

కాగా, 2019 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీమిండియాలో నాలుగో స్థానం కోసం అంబటి రాయుడు ప్రధాన రేసులో ఉన్నాడు. అయితే, చివరి నిమిషంలో సెలెక్టర్లు అతని స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను '3డి ప్లేయర్' (మూడు రకాలుగా ఉపయోగపడతాడని) అంటూ ఎంపిక చేయడం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
Robin Uthappa
Virat Kohli
Ambati Rayudu
2019 World Cup
Vijay Shankar
Indian Cricket Team
Cricket Selection Controversy
3D player
Uthappa Interview
Kohli Friendship

More Telugu News