DK Aruna: కేసీఆర్‌కు ఏ పాపం తెలియదంటే నమ్మేదెవరు?: కవితపై డీకే అరుణ ఫైర్

DK Aruna Fires at Kavitha Over KCRs Innocence in Kaleshwaram Scam
  • కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింతపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందన
  • ప్రాజెక్టు అవినీతిలో కేసీఆర్ కుటుంబం మొత్తానికీ భాగముందని ఆరోపణ
  • విచారణలో కాంగ్రెస్ తాత్సారం వెనుక బీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తన తండ్రి కేసీఆర్‌కు ఏ పాపం తెలియదంటూ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను ప్రజలు నమ్మబోరని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ భాగం ఉందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంపై స్పందించిన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు.

డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ, "ఏ రాజకీయ లబ్ధి కోసం కవిత గారు ఆ డైలాగులు కొట్టారో అర్థం కావడం లేదు. కాళేశ్వరం డిజైన్ చేసింది నేనే అని కేసీఆరే స్వయంగా చెప్పారు. ఇప్పుడు కేసు విచారణకు వచ్చేసరికి ఆయనకు ఏ పాపం తెలియదంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటారు తప్ప నమ్మరు" అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణలో కావాలనే తాత్సారం చేసిందని డీకే అరుణ ఆరోపించారు. "అధికారంలోకి రాగానే సీబీఐకి అప్పగిస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇన్నాళ్లూ కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేసింది. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందంలా కనిపిస్తోంది. బీఆర్ఎస్‌ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లుంది," అని ఆమె విమర్శించారు. నివేదికలో ఏముందో కూడా బయటపెట్టకుండా, అర్ధరాత్రి అసెంబ్లీలో చర్చ పెట్టి సీబీఐకి అప్పగించారని దుయ్యబట్టారు.

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని ఆమె గుర్తుచేశారు. "కాంగ్రెస్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది. ఏదో చేద్దామనుకుని, చివరికి ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాలి" అని డీకే అరుణ డిమాండ్ చేశారు. 
DK Aruna
DK Aruna BJP
KCR
Kalvakuntla Kavitha
Kaleshwaram project
Telangana corruption
CBI investigation
Telangana news
BRS party
Congress party

More Telugu News