Keshava Rao: కేంద్రం ఎన్‌ఈపీకి తెలంగాణ చెక్.. సొంత విద్యా విధానానికి శ్రీకారం

Telangana to Formulate Own Education Policy Bypassing NEP 2020
  • కేంద్రం ఎన్‌ఈపీకి బదులు తెలంగాణ సొంత విద్యా విధానం
  • నూతన పాలసీ రూపకల్పనకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
  • కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేశవరావు నియామకం
  • అక్టోబరు 30లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ఆదేశం
  • 'తెలంగాణ రైజింగ్‌-2027' లక్ష్యంగా విద్యా సంస్కరణలు
  • 2026-27 నుంచి కొత్త విధానం అమలుకు ప్రణాళిక
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకంగా నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ అంశంపై తటస్థ వైఖరితో ఉన్న రాష్ట్ర సర్కార్, తాజాగా సొంత పాలసీ రూపకల్పన కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెలంగాణ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఆకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి నియమితులయ్యారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అవసరమైతే మరో సభ్యుడిని నియమించుకునే అధికారాన్ని ఛైర్మన్‌కు కల్పించారు. ఈ కమిటీ అక్టోబరు 30వ తేదీలోగా తమ నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది.

‘తెలంగాణ రైజింగ్‌-2027’ లక్ష్యానికి అనుగుణంగా కొత్త విద్యా విధానం ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ బోధన, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, పరిశోధనలు, అంతర్జాతీయ అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పారిశ్రామిక రంగానికి, విద్యాసంస్థలకు మధ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని కోరింది. పాఠశాల విద్య నుంచి ఉన్నత, సాంకేతిక విద్య వరకు అన్ని స్థాయిల్లో అవసరమైన సంస్కరణలను ఈ కమిటీ సిఫారసు చేయనుంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను కాషాయీకరణ చేసేందుకే ఎన్‌ఈపీ-2020ని ఏకపక్షంగా తీసుకొచ్చిందని పలు రాష్ట్రాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించి సొంత విధానాలను రూపొందించుకుంటున్నాయి. ఇప్పటివరకు తటస్థంగా ఉన్న తెలంగాణ సైతం ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. ఎన్‌ఈపీలోని వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి, రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కొన్ని ముఖ్యమైన అంశాలను స్వీకరించి ఈ కొత్త విధానాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ నూతన విద్యా విధానాన్ని 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Keshava Rao
Telangana new education policy
NEP 2020
Telangana education system
education policy committee
Kadiam Srihari
Akunuri Murali
higher education
digital education
skill development

More Telugu News