Sudan Landslide: సూడాన్‌లో ఘోర విషాదం.. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 1000 మందికి పైగా మృతి

At least 1000 dead after landslide wipes out village in Western Sudan
  • పశ్చిమ సూడాన్‌లో విరిగిపడిన కొండచరియలు
  • వెయ్యి మందికి పైగా దుర్మరణం
  • ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డ వైనం
  • పూర్తిగా నేలమట్టమైన ఓ గ్రామం
  • భారీ వర్షాలే కారణమని వెల్లడి
సూడాన్‌లో ఓ పెను విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఏకంగా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర దుర్ఘటనలో ఓ గ్రామం పూర్తిగా నేలమట్టం కాగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

సూడాన్‌ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ (ఎస్‌ఎల్‌ఎం/ఏ) ఈ విషయాన్ని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆగస్టు 31వ తేదీన ఈ దుర్ఘటన జరిగిందని అబ్దెల్వాహిద్ మహ్మద్ నూర్ నేతృత్వంలోని ఈ బృందం తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు, పురుషులు ఉన్నారని పేర్కొంది.

ఉత్తర డార్ఫుర్ రాష్ట్రంలో సైన్యానికి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్)కు మధ్య భీకర అంతర్యుద్ధం జరుగుతుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వలస వచ్చారు. ఇప్పటికే ఆహారం, మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్న వీరు, ఇప్పుడు ప్రకృతి విపత్తు రూపంలో మృత్యువాత పడటం అందరినీ కలచివేస్తోంది.

గ్రామం పూర్తిగా భూమిలోకి కుంగిపోయిందని, కొండచరియల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సహాయ సంస్థలను సూడాన్‌ లిబరేషన్ మూవ్‌మెంట్ కోరింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ అంతర్యుద్ధం కారణంగా దేశంలో సగం జనాభా తీవ్ర ఆకలితో అలమటిస్తుండగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
Sudan Landslide
Sudan
Marra Mountains
Darfur
Sudan Liberation Movement
SLM/A
Rapid Support Forces
RSF
Flooding
Natural Disaster

More Telugu News