Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీకి సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Warns Akbaruddin Owaisi on Kaleshwaram Project Issue
  • కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ
  • ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన అక్బరుద్దీన్
  • కాంట్రాక్టర్లను ఎందుకు వదిలేశారని నిలదీత
  • ప్రాజెక్టును కూలుస్తారా, కొనసాగిస్తారా అని ప్రశ్న
  • ప్రభుత్వంతో జోకులు వద్దని రేవంత్ స్నేహపూర్వక హెచ్చరిక
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. ఈ అంశంపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అక్బరుద్దీన్ ప్రశ్నలకు బదులిస్తూ సీఎం రేవంత్ రెడ్డి.. "మీరు నాకు మంచి మిత్రులు. నాతో మజాక్ చేయండి కానీ, ప్రభుత్వంతో కాదు" అంటూ స్నేహపూర్వకంగానే గట్టి హెచ్చరిక చేయడం చర్చనీయాంశమైంది.

 అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదికపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. "కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం కూల్చివేస్తుందా? నిలిపివేస్తుందా? లేక కొనసాగిస్తుందా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలి" అని డిమాండ్ చేశారు. కమిషన్ నివేదికలో బాధ్యులైన కాంట్రాక్టర్ల పేర్లను ఎందుకు చేర్చలేదని ఆయన నిలదీశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పాలకులకు, కాంట్రాక్టర్లకు మధ్య ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ.. "ప్రభుత్వాలకు నీటిపారుదల ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయి. కాంట్రాక్టర్లు కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకే ఎన్నికల బాండ్లు ఇస్తారు. ఎంఐఎం, కమ్యూనిస్టు వంటి పార్టీలకు ఇవ్వరు" అని ఆయన అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కేసీఆర్ వరకు, ఇప్పుడు కూడా అవే కాంట్రాక్టు సంస్థలు పనులు చేస్తున్నాయని అక్బరుద్దీన్ గుర్తుచేశారు. ఘోష్ నివేదికపై చర్యల కోసం కేబినెట్ సిఫారసు చేయకుండా, సభను సలహాలు అడగడం విచిత్రంగా ఉందని ఆయన విమర్శించారు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ గట్టిగా బదులిచ్చారు. "అక్బరుద్దీన్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను నివేదిక పూర్తిగా చదివాకే మాట్లాడుతున్నా, కావాలంటే పేజీ నెంబర్లు సహా చెబుతా. కమిషన్ అన్ని అంశాలను ప్రస్తావించింది" అని స్పష్టం చేశారు. సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తాము సలహాలు కోరుతున్నామని, ఇస్తే స్వీకరిస్తామని, లేకపోయినా చర్యలు ఎలా తీసుకోవాలో తమకు తెలుసని సీఎం అన్నారు. కాళేశ్వరంపై చర్యలు తీసుకోవాలనే చిత్తశుద్ధితోనే అర్ధరాత్రి వరకు సభను నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. "మీరు నాకు మంచి మిత్రులు. నాతో మజాక్ చేయండి. ప్రభుత్వంతో చేయకండి" అని సున్నితంగా హెచ్చరించారు.
Akbaruddin Owaisi
Revanth Reddy
Telangana Assembly
Kaleshwaram Project
Justice PC Ghosh Commission
MIM
BRS
Congress
Telangana politics
Irrigation projects

More Telugu News