Ravinder: 25 కేజీల బ్యాంకు బంగారం తాకట్టు పెట్టి క్రికెట్ బెట్టింగ్.. మంచిర్యాల బ్యాంకు మేనేజర్, క్యాషియర్ ల స్కాం!

Mancherial SBI Gold Loan Scam Manager Ravinder Involved in Betting
  • మంచిర్యాల చెన్నూరు ఎస్‌బీఐలో ఘటన
  • ఖాతాదారులకు చెందిన 25 కిలోల బంగారం స్వాహా
  • బ్యాంకు మేనేజర్, క్యాషియర్, సిబ్బందే సూత్రధారులు
  • క్రికెట్ బెట్టింగ్ కోసం బంగారాన్ని వేరేచోట తాకట్టు పెట్టిన నిందితులు
  • మొత్తం 47 మందిపై కేసు నమోదు, 15 కిలోల బంగారం రికవరీ
  • బ్యాంకు ఆడిటింగ్‌లో వెలుగు చూసిన భారీ కుంభకోణం
కంచే చేను మేసిన చందంగా, ప్రజలు ఎంతో నమ్మకంతో దాచుకున్న బంగారానికే బ్యాంకు సిబ్బంది కన్నం వేశారు. ఖాతాదారుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుని, వారి గోల్డ్ లోన్ ఖాతాల నుంచి ఏకంగా 25 కిలోల బంగారాన్ని దొంగిలించి, ఆ సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో వెలుగుచూసింది. ఈ భారీ మోసంలో బ్యాంకు మేనేజర్, క్యాషియర్లే ప్రధాన సూత్రధారులు కావడం కలకలం రేపుతోంది.

చెన్నూరులోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) బ్రాంచిలో ఈ కుంభకోణం జరిగింది. ఇక్కడ క్యాషియర్‌గా పనిచేస్తున్న నరిగె రవీందర్‌కు క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఉంది. ఈ బెట్టింగ్‌లలో సుమారు రూ. 40 లక్షలు పోగొట్టుకోవడంతో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అడ్డదారి తొక్కాడు. బ్యాంకు మేనేజర్ ఎన్నపురెడ్డి మనోహర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి ఖాతాదారుల బంగారాన్ని కొట్టేయడానికి పథకం రచించాడు.

గతేడాది అక్టోబర్ నుంచి వీరు తమ ప్రణాళికను అమలు చేశారు. బ్యాంకులోని 402 మంది ఖాతాదారుల గోల్డ్ లోన్ ప్యాకెట్ల నుంచి కొద్దికొద్దిగా 25.17 కిలోల బంగారాన్ని బయటకు తీశారు. ఈ బంగారాన్ని కొన్ని ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో పనిచేస్తున్న ధీరజ్, రాజశేఖర్, కిషన్‌లకు అప్పగించారు. వారు ఆ బంగారాన్ని తమ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. వచ్చిన డబ్బులోంచి కమీషన్ ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని రవీందర్ ఖాతాకు బదిలీ చేసేవారు. ఈ డబ్బును రవీందర్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కోసం ఉపయోగించినట్లు, ఈ సొమ్మంతా విదేశాలకు మళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇటీవల బ్యాంకు ఆడిటింగ్ తనిఖీల్లో ఈ భారీ గోల్డ్ లోన్ స్కామ్ బట్టబయలైంది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన అధికారులు, వెంటనే బ్యాంకు రీజినల్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు క్యాషియర్ రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం స్కామ్ గుట్టు రట్టయింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా మీడియాకు వెల్లడించారు. బ్యాంకు మేనేజర్, క్యాషియర్‌తో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగులు, బినామీలతో కలిపి మొత్తం 47 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి ఇప్పటివరకు 15.23 కిలోల బంగారం, రూ. 1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వివరించారు.


Ravinder
SBI gold loan scam
Mancherial
Chennur
cricket betting
bank fraud
gold theft
Andhra Pradesh
Telangana
cyber crime

More Telugu News