Nadendla Manohar: వైసీపీ దుష్ప్రచారాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ .. క్యాడర్‌కు కీలక సూచనలు

Nadendla Manohar Fires on YCP Propaganda Key Instructions to Cadre
  • కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్
  • వైసీపీ దుష్ప్రచారాలను క్యాడర్ తిప్పికొట్టాలన్న నాదెండ్ల మనోహర్
  • వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దని సూచన
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతోందని జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఖండించాలని, అదే సమయంలో వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదని ఆయన సూచించారు.

‘సేనతో సేనాని’ పేరుతో విశాఖ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ "జనసేన ఇప్పుడు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది అధినేత పవన్ కల్యాణ్ చేసిన నిరంతర పోరాటాల ఫలితం" అని పేర్కొన్నారు. వీర మహిళ గోవిందమ్మ అర్ధరాత్రి దీక్షను ఉదాహరణగా పేర్కొంటూ, అలాంటి త్యాగాలే పార్టీని ముందుకు నడిపిస్తున్నాయన్నారు.

ఎన్నికల హామీల అమలుపై కేంద్రం, రాష్ట్రంతో కలిసి కృషి:

పవన్ కల్యాణ్ సీఎం, ప్రధాని సహకారంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో నిష్టతో పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకే ఈ సభను నిర్వహించామని చెప్పారు.

రుషికొండ భవనంపై విమర్శలు – జగన్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్:

గత పాలకులు రూ.450 కోట్లతో నిర్మించిన రుషికొండ భవనాన్ని పరిశీలించగానే అసత్య కథనాలు ప్రచురించారని విమర్శించారు. ‘‘పెచ్చులు ఊడిపోయాయంటే మేమేదో చేశామన్నట్టుగా కథనాలు రాశారు. వాస్తవానికి రూ.450 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు?” దీనిపై జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికే 12 లక్షల మందికి పైగా జనసేన సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. వారంతా పార్టీకి బలమని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు నాగబాబు, హరిప్రసాద్, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, లోకం నాగమాధవి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
Nadendla Manohar
Janasena
YCP
Vishakapatnam
Andhra Pradesh Politics
Pawan Kalyan
Rushikonda
TDP
BJP
Election promises

More Telugu News