Ravanaidu: 'ఆడుదాం ఆంధ్ర' అవినీతిపై త్వరలో చర్యలు: ఏపీ శ్యాప్ చైర్మన్ రవినాయుడు కీలక వ్యాఖ్యలు

Ravanaidu Comments on Aadudam Andhra Corruption Investigation
  • 'ఆడుదాం ఆంధ్ర' అవినీతిలో సెప్టెంబర్ 5లోపు చర్యలు ఉంటాయన్న రవినాయుడు 
  • విజిలెన్స్‌ నివేదిక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందిందన్న రవినాయుడు
  • లింగ భేదం లేకుండా బాధ్యులందరిపైనా చర్యలు ఉంటాయన్న రవినాయుడు
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా కార్యక్రమంలో చోటు చేసుకున్న అవినీతిపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ రవినాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆడుదాం ఆంధ్ర'లో అవినీతికి పాల్పడిన వారిపై సెప్టెంబర్ 5లోపు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిందని వెల్లడించారు.

విజయవాడలోని శాప్ కార్యాలయంలో నిన్న ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘దోషులు ఎవరైనా సరే, ప్రభుత్వం ఉపేక్షించదు. లింగ భేదం లేకుండా అందరిపై తగిన చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు. ఆర్కే రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్రాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గతంలో టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో లింగ భేదం లేకుండా అందరిపై తగిన చర్యలు తీసుకుంటామని రవినాయుడు వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

క్రీడా సంఘాల గందరగోళంపై స్పందన:

ఒకే క్రీడకు రెండు, మూడు సంఘాలు ఉండటంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. శాప్ నియమావళి ప్రకారం, ఒక్కో క్రీడకు ఒక్క సంఘమే నెలరోజుల్లోగా ఏర్పడాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని రవినాయుడు హెచ్చరించారు.

స్పోర్ట్స్ కోటాలో నకిలీ ధ్రువపత్రాల వివాదం:

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాను విద్యాశాఖకు పంపించామని, తుది జాబితా త్వరలో ప్రకటించనున్నామని తెలిపారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించే అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేసిన వారిలో 870 మంది నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు గుర్తించామని, దీనిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శాప్ పాలకమండలి సభ్యుడు ఎస్. సంతోష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. 
Ravanaidu
Aadudam Andhra
AP Shap
Sports Authority of Andhra Pradesh
RK Roja
Corruption Allegations
Andhra Pradesh Sports
Sports Quota
Fake Certificates
Sports Associations

More Telugu News