Chandrababu Naidu: వెంకన్నపై భారం వేసి బుల్లెట్‌లా దూసుకెళతా: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Vows to Transform Rayalaseema into Ratnala Seema
  • కుప్పం నియోజకవర్గానికి చేరిన కృష్ణా జలాలు.. పరమసముద్రం వద్ద జలహారతి
  • రాయలసీమను రత్నాల సీమగా మార్చే బాధ్యత తనదేనని చంద్రబాబు స్పష్టీకరణ
  • వైసీపీ హయాంలో ప్రాజెక్టులపై కేవలం రూ. 2 వేల కోట్లే ఖర్చు చేశారని విమర్శ
  • వచ్చే ఏడాదికల్లా చిత్తూరుకు కూడా హంద్రీనీవా నీళ్లు అందిస్తామని హామీ
పవిత్రమైన సంకల్పంతో ఏ పని మొదలుపెట్టినా విజయం తథ్యమని, ఆ తిరుమల వెంకన్నపై పూర్తి భారం వేసి రాష్ట్రాభివృద్ధి కోసం బుల్లెట్‌లా ముందుకు దూసుకెళతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కరవుతో అల్లాడే రాయలసీమను రతనాల సీమగా మార్చే పూర్తి బాధ్యత తనదేనని ఆయన ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం వద్దకు కృష్ణా జలాలు చేరుకున్న చారిత్రక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన కృష్ణా నదికి జలహారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, "ఈ జలాలతో కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఒకప్పుడు కరవు వస్తే పశువుల దాహం తీర్చడానికి రైళ్లలో నీళ్లు తెప్పించుకున్న దుస్థితి నుంచి, ఇవాళ 738 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలను ఇక్కడికి తీసుకురాగలిగాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వ ఘనత. మల్యాల నుంచి 27 లిఫ్ట్‌ ఇరిగేషన్ల ద్వారా నీటిని తరలించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 110 చెరువులను నింపే అవకాశం ఇప్పుడు కలిగింది" అని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించగలిగితే తన జన్మ సార్థకమవుతుందని ఆయన భావోద్వేగంగా అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "2014-19 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం మేము రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం రూ.2 వేల కోట్లతో సరిపెట్టింది. వాళ్లు అసత్యాలు చెప్పడంలో దిట్టలు. గేట్లతో సెట్టింగ్‌లు చేసి నీళ్లు తెచ్చినట్లు నాటకాలడటం తప్ప చేసిందేమీ లేదు. మేము కష్టపడి నీళ్లు తీసుకొస్తే ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు" అని మండిపడ్డారు. మంచి పనులను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ఒక విషవృక్షంగా మారిందని, దమ్ముంటే అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడాలని సవాల్ విసిరారు.

భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ, హంద్రీనీవా ఫేజ్-1, ఫేజ్-2 ప్రాజెక్టుల ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించడంతో పాటు పరిశ్రమలకు కూడా నీళ్లు ఇస్తామని తెలిపారు. "ఇప్పుడు కుప్పానికి నీళ్లు వచ్చాయి. రాబోయే ఏడాది కాలంలోగా హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను" అని హామీ ఇచ్చారు. 

పోలవరం-బనకచర్ల అనుసంధానం పూర్తి చేసి, వంశధార నుంచి పెన్నా నది వరకు నదులను అనుసంధానిస్తే రాష్ట్రంలో కరవు అనే మాటే వినిపించదని స్పష్టం చేశారు. నీళ్లు లేని పరిస్థితి వస్తేనే నీటి విలువ తెలుస్తుందని, భూమిని కూడా ఒక జలాశయంగా మార్చడం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. నదుల అనుసంధానం ప్రయోజనాలను తెలంగాణ నేతలు కూడా గ్రహించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Rayalaseema
Krishna River
Kuppam
Irrigation Project
Handri Neeva
Polavaram Project
River Linking

More Telugu News