Chandrababu Naidu: వైజాగ్ తీరంలో డబుల్ డెక్కర్ సందడి.. పర్యాటకులకు చంద్రబాబు గుడ్ న్యూస్

Chandrababu Naidu Announces Discount on Vizag Double Decker Bus Tickets
  • విశాఖ బీచ్ రోడ్డులో రెండు డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభం
  • జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • రూ. 500 టికెట్ ధరను సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటన
  • మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడి
  • మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం
  • మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ ఎంపిక కావడంపై హర్షం
పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలో సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు 'హాప్ ఆన్ హాప్ ఆఫ్' డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ రెండు బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యాటకులకు ఆయన ఓ శుభవార్త అందించారు. బస్సు టికెట్ ధరను అక్కడికక్కడే సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 24 గంటల పాటు ప్రయాణించేందుకు వీలుగా టికెట్ ధరను అధికారులు రూ. 500గా నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందిస్తూ పర్యాటకులపై భారం తగ్గించే ఉద్దేశంతో ధరను సగానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన సగం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. దీంతో పర్యాటకులు కేవలం రూ. 250తో రోజంతా డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించవచ్చు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. 'నారి' సర్వేలో మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖ ఎంపిక కావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రులు కందుల దుర్గేష్, అనిత, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో కలిసి ఆయన బస్సులో పార్క్ హోటల్ వరకు ప్రయాణించారు. ప్రయాణంలో దారిపొడవునా ప్రజలకు చంద్రబాబు అభివాదం చేస్తూ కొందరిని తన పక్కన కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా ముచ్చటించారు.
Chandrababu Naidu
Vizag
Visakhapatnam
Double Decker Bus
Tourism
Andhra Pradesh
Beach Road
Kandula Durgesh
Hari Narayana Prasad

More Telugu News