Revanth Reddy: స్కూళ్లు, కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్.. విద్యావ్యవస్థపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Revanth Reddy Orders Facial Recognition in Telangana Schools and Colleges
స్కూళ్లు, కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు సీఎం ఆదేశం
విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి కొత్త విధానం వర్తింపు
విద్యాసంస్థల నిర్మాణ పనులన్నీ ఒకే ఏజెన్సీకి అప్పగింత
బాలికల పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచన
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కొత్త విధానం ద్వారా హాజరు శాతం మెరుగుపడటంతో పాటు, వృత్తి విద్యా సంస్థల్లోని లోపాలను సరిదిద్దవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో (ఐసీసీసీ) విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్నిచోట్లా మౌలిక వసతులను మెరుగుపరిచి, మెరుగైన బోధనా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

విద్యాశాఖ పరిధిలో అదనపు తరగతి గదులు, వంటశాలలు, టాయిలెట్లు, ప్రహరీ గోడల నిర్మాణ పనులను వేర్వేరు ఏజెన్సీలకు అప్పగించడం సరైన పద్ధతి కాదని సీఎం అన్నారు. నాణ్యత, పర్యవేక్షణ, నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ఈ నిర్మాణ పనులన్నింటినీ ఒకే విభాగానికి అప్పగించాలని ఆదేశించారు. ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కే (ఈడబ్ల్యూఐడీసీ) ఈ బాధ్యతలు అప్పగించాలని ఆయన తేల్చిచెప్పారు.

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను గ్రీన్ ఛానెల్ ద్వారా తక్షణమే క్లియర్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని హెచ్చరించారు. అదేవిధంగా, ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ కింద చేపట్టిన పారిశుద్ధ్య పనుల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని స్పష్టం చేశారు. మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, వంట కోసం సోలార్ ప్యానెళ్లతో కూడిన కంటైనర్ కిచెన్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించిన సీఎం, అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను (పీఈటీలు) నియమించుకోవాలని తెలిపారు. సంక్షేమ గురుకులాల్లోని బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సెలర్లను నియమించడంపైనా సమావేశంలో చర్చించారు. విద్యా రంగంపై చేసే ఖర్చును పెట్టుబడిగా భావించాలని సీఎం అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులే చదువుతున్నందున, గత 10 ఏళ్లలో చదివిన వారి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
Revanth Reddy
Telangana education
facial recognition attendance
school attendance
midday meal scheme
government schools Telangana
EWIDC
Amma Adarsha Patashalalu
digital education

More Telugu News