Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసు.. పవన్ పై ఆరోపణల నేపథ్యంలో జనసేన స్పందన

Janasena Reacts to Allegations Against Pawan Kalyan in Sugali Preethi Case
  • కేసును పవన్ పట్టించుకోవడం లేదని సుగాలి ప్రీతి తల్లి ఆరోపణ
  • పవన్ కల్యాణ్ వల్లే ఈ కేసు వెలుగులోకి వచ్చిందన్న జనసేన
  • గతంలో పవన్ చేసిన పోరాటాన్ని గుర్తు చేసిన వైనం
కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రీతి తల్లి పార్వతి చేసిన ఆరోపణలపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి గొంతెత్తకపోయి ఉంటే, ఈ కేసు ఎప్పుడో మరుగున పడిపోయేదని పేర్కొంది. సాయం పొందిన వారు కృతజ్ఞత చూపకపోవడం కూడా తప్పే అవుతుందని వ్యాఖ్యానించింది.

జనసేన విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 2017 ఆగస్టులో సుగాలి ప్రీతి హత్య జరగ్గా, ఈ ఘటన 2019 డిసెంబర్‌లో తొలిసారి పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ, బాధితురాలి తల్లిదండ్రులు పార్టీ కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకోగానే పవన్ చలించిపోయారని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతానని హామీ ఇచ్చారని జనసేన గుర్తు చేసింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ కేసుపై అసెంబ్లీలో చర్చించాలని, లేదంటే కర్నూలులో భారీ నిరసన చేపడతామని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించింది.

ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో, 2020 ఫిబ్రవరి 12న ‘ర్యాలీ ఫర్ జస్టిస్’ పేరుతో పవన్ కల్యాణ్ కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారని జనసేన తెలిపింది. ఆ సభలో సుగాలి ప్రీతి తల్లి పార్వతి మాట్లాడుతూ, తమ బిడ్డకు న్యాయం కోసం గళం విప్పిన మొదటి నాయకుడు పవన్ కల్యాణే అని ఎన్నోసార్లు చెప్పారని పేర్కొంది. పవన్ ఒత్తిడి కారణంగానే నాటి వైసీపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 27న కేసును సీబీఐకి బదిలీ చేస్తూ జీవో జారీ చేసిందని వివరించింది.

అయితే, జీవో ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్లే సీబీఐ విచారణ ముందుకు సాగలేదని జనసేన ఆరోపించింది. అధికారంలోకి వచ్చాక కూడా పవన్ ఈ కేసును మర్చిపోలేదని, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రీతి తల్లిదండ్రులను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారని తెలిపింది. విచారణ వేగవంతం చేయాలని హోంమంత్రి అనితకు సూచించారని, ఆమెను కలవమని బాధితులకు చెప్పారని పేర్కొంది. పవన్ చొరవతోనే ఈ కేసు ఇంతవరకైనా వచ్చిందని, అలాంటి వ్యక్తిని ఇప్పుడు ప్రశ్నించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది. 
Pawan Kalyan
Sugali Preethi case
Janasena
Kurnool
Parvathi
CBI investigation
Andhra Pradesh politics
Deputy CM
Home Minister Anitha
Rally for Justice

More Telugu News