Pawan Kalyan: రుషికొండ ప్యాలెస్ లో బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లు చూసి విస్తుపోయిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Shocked by Lavish Rooms at Rushikonda Palace
  • విశాఖ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన వైనం
  • ఈ ప్యాలెస్ పై అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న పవన్
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించి తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్... మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండకు చేరుకున్నారు. భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లను చూసి విస్తుపోయారు. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్ లు అవసరమా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పవన్ కల్యాణ్‌కు వివరించారు. గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ కొత్త భవనాల నిర్వహణకే దాదాపు కోటి రూపాయల బిల్లులు బకాయి పడిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనాల నిర్మాణంపై ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని అధికారులు పవన్‌కు తెలిపారు.

పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది" అని వ్యాఖ్యానించారు. రుషికొండ భవనాల నిర్మాణం, ఖర్చు, పర్యావరణ విధ్వంసం వంటి అన్ని అంశాలపై శాసనసభ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను పరిశీలించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు వచ్చానని తెలిపారు. పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Pawan Kalyan
Rushikonda
Rushikonda Palaces
Andhra Pradesh Tourism
Janasena
Kandula Durgesh
Green Tribunal
Visakhapatnam

More Telugu News