JD Vance: ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఏదైనా అనుకోనిది జరిగితే నేనున్నాను: జేడీ వాన్స్

Prez Trump in good shape but ready to take charge in case of any terrible tragedy says JD Vance
  • ట్రంప్ ఆరోగ్యంపై స్పందించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
  • అధ్యక్షుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారని పూర్తి భరోసా
  • అనుకోనిది జరిగితే బాధ్యతలకు సిద్ధమంటూ కీలక వ్యాఖ్య
  • చేతిపై గాటు, నడకలో తేడాతో పెరిగిన ఆందోళనలు
  • గత 200 రోజుల్లో అద్భుతమైన శిక్షణ పొందానన్న వాన్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని భరోసా ఇస్తూనే, ఏదైనా అనుకోనిది జరిగితే దేశాన్ని నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఒకే సమయంలో ఆయన చేసిన ఈ రెండు రకాల వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

ఇటీవల యూఎస్ఏ టుడే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఈ విషయాలపై మాట్లాడారు. 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన తన నాలుగేళ్ల పదవీకాలాన్ని సులభంగా పూర్తి చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "అధ్యక్షుడు అద్భుతమైన ఆరోగ్యంతో, గొప్ప శక్తితో ఉన్నారు. ఆయన తన పదవీకాలం పూర్తి చేసి అమెరికా ప్రజలకు గొప్ప సేవ చేస్తారన్న పూర్తి నమ్మకం నాకుంది" అని వాన్స్ అన్నారు.

అయితే, ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో సమావేశమైనప్పుడు ట్రంప్ చేతిపై పెద్ద గాటు కనిపించడం, ఆయన కాళ్లలో వాపులు, నడకలో స్వల్ప మార్పులు వంటి అంశాలపై మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాన్స్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. జనవరిలో 78 ఏళ్ల 7 నెలల వయసులో అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్, అమెరికా చరిత్రలోనే బాధ్యతలు చేబట్టిన అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలిచారు. అంతకుముందు జోబైడెన్ ప్రమాణం చేసే నాటికి ఆయన వయసు 78 ఏళ్ల 2 నెలలు మాత్రమె కావడం గమనార్హం!  

ఇదే సమయంలో, ఒకవేళ అధ్యక్షుడికి ఏదైనా జరిగితే బాధ్యతలు స్వీకరించేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని వాన్స్ తెలిపారు. "దేవుడి దయవల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకూడదని కోరుకుంటున్నాను. కానీ, ఒకవేళ అలాంటిది జరిగితే, బాధ్యతలు చేపట్టేందుకు గత 200 రోజులుగా నేను పొందిన శిక్షణ కంటే మెరుగైనది మరొకటి ఉండదు" అని ఆయన పేర్కొన్నారు. 'మాగా' ఉద్యమానికి తన వారసుడు వాన్సే అని ఈ నెల మొదట్లో ట్రంప్ వ్యాఖ్యానించినప్పటికీ, 2028 ఎన్నికల ప్రణాళికలపై వస్తున్న ఊహాగానాలను 41 ఏళ్ల వాన్స్ కొట్టిపారేశారు.
JD Vance
Donald Trump
Trump health
US President
2024 elections
USA Today
Lee Jae-myung
MAGA movement
US politics

More Telugu News