Heavy Rains: అల్పపీడనంకు అనుబంధంగా ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు మరో వారం రోజులపాటు భారీ వర్షాలే

Heavy Rains Alert for AP and Telangana for Next Week
  • ఛత్తీస్‌గఢ్‌లో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు
  • ఏపీలోని 6 ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద సిగ్నల్ జారీ
  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వానల అంచనా
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండటంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని ఆరు ప్రధాన ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు గట్టిగా హెచ్చరించారు.  

మరోవైపు, తెలంగాణలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 
Heavy Rains
Andhra Pradesh
Telangana
Weather Forecast
IMD
Rain Alert
Low Pressure
Monsoon
Coastal Andhra
Telangana Rains

More Telugu News