Richard Wolff: భారత్‌తో పెట్టుకుంటే అమెరికాకే నష్టం: ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్

Richard Wolff criticizes US policy towards India and Russia
  • భారత్‌పై అమెరికా టారిఫ్‌లు స్వీయ వినాశకరమేనన్న ఆర్థికవేత్త
  • ఏనుగుతో ఎలుక పోరాటంలా ఉందని రిచర్డ్ వోల్ఫ్ వ్యాఖ్య
  • అమెరికా చర్యలతో బ్రిక్స్ కూటమి మరింత బలపడుతుందని విశ్లేషణ
  • బ్రిక్స్ వాటా 35 శాతం, జీ7 వాటా 28 శాతం అని గుర్తు చేసిన వోల్ఫ్
భారత్ విషయంలో అమెరికా ప్రపంచానికే పెద్దన్నలా వ్యవహరిస్తోందని, కానీ ఈ చర్యలతో తన కాలిపై తానే గొడ్డలివేటు వేసుకుంటోందని ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా విధించిన భారీ సుంకాలను ఆయన తప్పుబట్టారు. అమెరికా తీరు "ఒక ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉంది" అని ఆయన అభివర్ణించారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌కు చెందిన పలు ఉత్పత్తులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచారు. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఆర్థికంగా నష్టం కలిగించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది.

రష్యా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచర్డ్ వోల్ఫ్ మాట్లాడుతూ.. అమెరికా చర్యల వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. "అమెరికా మార్కెట్ మూసుకుపోతే, భారత్ తన ఉత్పత్తులను బ్రిక్స్ దేశాలకు అమ్ముకుంటుంది. గతంలో రష్యా తన ఇంధనాన్ని ఇతర దేశాలకు అమ్ముకున్నట్లే, భారత్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటుంది" అని ఆయన విశ్లేషించారు. అమెరికా చర్యలు పాశ్చాత్య దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బ్రిక్స్ కూటమిని మరింత బలోపేతం చేస్తాయని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తిలో బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యూఏఈ) వాటా 35 శాతానికి చేరిందని, అదే సమయంలో జీ7 దేశాల (కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా) వాటా 28 శాతానికి పడిపోయిందని వోల్ఫ్ గుర్తుచేశారు. "ఇది ఒక చారిత్రక ఘట్టం. పశ్చిమ దేశాలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమిని అమెరికాయే దగ్గరుండి పెంచి పోషిస్తోంది" అని ఆయన అన్నారు.

గతంలో ట్రంప్ పలు సందర్భాల్లో బ్రిక్స్‌ను "ఒక చిన్న బృందం" అని, "త్వరలో కనుమరుగైపోతుంది" అని కొట్టిపారేశారు. ఉమ్మడి కరెన్సీని తీసుకొస్తే 100 శాతం టారిఫ్‌లు విధిస్తామని కూడా హెచ్చరించారు. అయితే, వోల్ఫ్ మాత్రం సోవియట్ కాలం నుంచి భారత్, రష్యాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, అమెరికా ఇప్పుడు చాలా భిన్నమైన ప్రత్యర్థితో ఆడుతోందని హెచ్చరించారు.
Richard Wolff
US India relations
India Russia oil
BRICS countries
American tariffs on India
US economic policy
Russia Ukraine war
BRICS vs G7
India trade
economic sanctions

More Telugu News