Mithun Reddy: జైల్లో మిథున్ రెడ్డిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు : గోరంట్ల మాధవ్

Mithun Reddy Tortured in Jail Says Gorantla Madhav
  • రాజమండ్రి జైల్లో మిథున్‌రెడ్డితో వైసీపీ నేతల భేటీ
  • పెద్దిరెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికే అరెస్ట్ అని ఆరోపణ
  • ఎమర్జెన్సీని మించి ప్రతిపక్షాలను వేధిస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శ
లిక్కర్ స్కాం ఆరోపణలతో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఆ పార్టీ నేతలు ములాఖత్ లో కలిశారు. మాజీ మంత్రి శంకరనారాయణ, మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, మార్గాని భరత్ తదితరులు మిథున్‌రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. ములాఖత్ అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ వీరు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతరం కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమే ఈ అరెస్ట్ అని వారు ఆరోపించారు.

గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జైలు, బెయిల్‌తోనే కాలం గడుపుతోందని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని మించి చంద్రబాబు ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. "గతంలో ఇదే జైలు వద్దకు వచ్చిన పవన్ కల్యాణ్ మాటలు కోటలు దాటాయి. ఇప్పుడు ఆయన కనీసం గడప దాటి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. జైల్లో మిథున్‌రెడ్డిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్నట్టుగా జైలు వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేశారు" అని విమర్శించారు.

శంకరనారాయణ మాట్లాడుతూ... లిక్కర్ స్కాం పేరుతో ప్రభుత్వం ఒక కట్టుకథ అల్లిందని మండిపడ్డారు. కేవలం పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ అక్రమ కేసు బనాయించారని అన్నారు. జగన్ ప్రతిష్టను కించపరిచేందుకు చంద్రబాబు పన్నుతున్న కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 

మార్గాని భరత్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఆరోపిస్తున్న రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో 90 రోజులు గడిచినా మనీ ట్రైల్‌ను ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. మద్యం డిస్టిలరీలు ఎవరికి ముడుపులు చెల్లించాయో ప్రజలకు వెల్లడించలేకపోతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, రాబోయేది జగన్ ప్రభుత్వమేనని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు.
Mithun Reddy
YS Jagan
Gorantla Madhav
Andhra Pradesh Politics
Liquor Scam
Rajahmundry Central Jail
TDP Government
Peddireddy Ramachandra Reddy
Margani Bharat
Political Vendetta

More Telugu News