KA Paul: ఆ మూడు పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయింది: కేఏ పాల్

KA Paul Slams Congress BJP BRS
  • మెదక్‌లో వరద బాధితులను పరామర్శించిన కేఏ పాల్
  • పునరావాస కేంద్రంలో ఉన్నవారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ
  • పార్టీలు గెలుస్తున్నాయే తప్ప ప్రజలు గెలవడం లేదన్న పాల్
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలను గాలికొదిలేయడం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. మెదక్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆహార ప్యాకెట్లు అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పార్టీల తీరు వల్ల ప్రజలకు వాటిపై పూర్తిగా నమ్మకం పోయిందని అన్నారు. "కాంగ్రెస్ 12 సార్లు, బీజేపీ 4 సార్లు, కేసీఆర్ రెండు సార్లు గెలిచారు. కానీ ఇన్నేళ్లుగా ప్రజలు మాత్రం గెలవలేకపోయారు" అని ఆయన వ్యాఖ్యానించారు. భారీ వర్షాలతో ప్రజలు తినడానికి తిండి, ఉండటానికి నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

అభివృద్ధిని పక్కనపెట్టి, మూడు పార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడమే పనిగా పెట్టుకున్నాయని పాల్ విమర్శించారు. రాష్ట్రంలో కుల, మత, అవినీతి రాజకీయాలు చేసే పార్టీలను ప్రజలు భూస్థాపితం చేసినప్పుడే మంచి రోజులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇళ్లు కోల్పోయిన వారందరికీ కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. 
KA Paul
KA Paul comments
Prajasanthi Party
Telangana politics
Telangana floods
Medak floods
Congress BJP BRS
Telangana government
Flood relief

More Telugu News