Donald Trump: నోబెల్ కోసం ట్రంప్ బహిరంగంగా లాబీయింగ్... నోబెల్ కమిటీ సభ్యుల అసంతృప్తి

Nobel Committee Members Unhappy with Trump Lobbying Efforts
  • ట్రంప్ ను ప్రశంసలతో ముంచెత్తుతూ రంగంలోకి దిగిన కేబినెట్ మంత్రులు
  • నేరుగా నార్వే ఆర్థిక మంత్రికి ఫోన్ చేసిన ట్రంప్
  • ట్రంప్‌కు శాంతి బహుమతిపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు మునుపెన్నడూ లేని విధంగా తీవ్రంగా ప్రయత్నిస్తుండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బహుమతి కోసం ఏకంగా అధ్యక్షుడే రంగంలోకి దిగి బహిరంగంగా లాబీయింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్‌లో విజేతను ప్రకటించేందుకు నోబెల్ కమిటీ చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

ట్రంప్‌ను ఒక శాంతి దూతగా చిత్రీకరించేందుకు ఆయన కేబినెట్ సభ్యులు నడుం బిగించారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మాట్లాడుతూ... “నోబెల్ బహుమతికి మీరే అత్యంత అర్హులైన అభ్యర్థి” అని ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు, లేబర్ సెక్రటరీ లోరి ఛావేజ్-డి రేమర్ తన కార్యాలయంలో ట్రంప్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆయనను "అమెరికా కార్మికుల కోసం వచ్చిన పరివర్తనాత్మక అధ్యక్షుడు" అని కొనియాడారు. ట్రంప్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించిందని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ ప్రశంసల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ లాబీయింగ్ మరో స్థాయికి చేరింది అనడానికి ట్రంప్ స్వయంగా చేసిన ఫోన్ నిదర్శనం. గత నెలలో ఆయన నార్వే ఆర్థిక మంత్రికి ఫోన్ చేసి టారిఫ్ చర్చల మధ్యలో నోబెల్ నామినేషన్ గురించి నేరుగా ప్రస్తావించినట్లు నార్వేజియన్ మీడియా కథనాలు వెల్లడించాయి.

మరోవైపు, ట్రంప్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఘాటుగా స్పందిస్తూ... "అమెరికన్ పౌరులపై మెరైన్లను ప్రయోగించిన వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వడం సరికాదు. ఆయన దేశానికి శాంతిని కాదు, యుద్ధ వాతావరణాన్ని తెచ్చారు" అని ఆరోపించారు. ఇజ్రాయెల్ జర్నలిస్ట్ గిడియాన్ లేవీ మరో అడుగు ముందుకేసి... "ట్రంప్ స్థానం నోబెల్ అవార్డు వేదికపై కాదు, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో" అని ఎద్దేవా చేశారు.

ఈ విమర్శలకు బలం చేకూరుస్తూ, నార్వే నోబెల్ కమిటీలోని ఐదుగురిలో ముగ్గురు సభ్యులు ట్రంప్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. "ట్రంప్ తన రెండవ పదవీకాలంలో అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు, మీడియాపై వందకు పైగా దాడులు చేశారు" అని కమిటీ చైర్మన్ జోర్గెన్ ఫ్రైడ్నెస్ పేర్కొన్నట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌కు శాంతి బహుమతి దక్కే అవకాశాలు దాదాపు లేనట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఒక బహుమతి కోసం అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి, ఆయన కేబినెట్ ఇంత బహిరంగంగా లాబీయింగ్ చేయడం మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 
Donald Trump
Nobel Peace Prize
Trump lobbying
Norway Nobel Committee
US Politics
International Relations
Jorgen Frydnes
Gavin Newsom
Steve Witkoff
Scott Bessent

More Telugu News