Virender Sehwag: ఆసియా కప్‌లో భారత్‌ను గెలిపించేది వాళ్లే.. ముగ్గురిని ఎంపిక చేసిన సెహ్వాగ్

Virender Sehwag Picks 3 Game Changers For India in Asia Cup 2025
  • త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025
  • టీమిండియాలో ముగ్గురు గేమ్ ఛేంజర్లున్నారన్న సెహ్వాగ్
  • అభిషేక్ శర్మ, బుమ్రా, వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసిన వీరూ
  • బౌలర్లకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ చాలా అవసరమన్న మాజీ క్రికెట‌ర్‌
  • ప్రధాన టోర్నీలకు పేసర్లు ఫిట్‌గా ఉండటం కీలకమన్న వీరేంద్రుడు
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సమీపిస్తున్న వేళ, భారత జట్టు విజయావకాశాలపై చర్చ ఊపందుకుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చేయగల ముగ్గురు కీలక ఆటగాళ్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డాడు.

సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ, యువ ఆటగాడు అభిషేక్ శర్మ, పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ఆయన గేమ్ ఛేంజర్లుగా పేర్కొన్నాడు. "నా అభిప్రాయం ప్రకారం, అభిషేక్ శర్మ ఒక గేమ్ ఛేంజర్ కాగలడు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా ఎప్పటికీ గేమ్ ఛేంజరే. వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ బౌలింగ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీలో, టీ20 ఫార్మాట్‌లో ఎంతో ప్రభావం చూపాడు. వీళ్లు ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాళ్లు" అని సెహ్వాగ్ వివరించాడు.

అనంతరం ఇటీవల తరచుగా చర్చకు వస్తున్న 'వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్' అంశంపైనా సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బ్యాటర్లతో పోలిస్తే, బౌలర్ల విషయంలోనే వర్క్‌లోడ్ నిర్వహణ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశాడు. "బ్యాటర్లకు వర్క్‌లోడ్ పెద్ద సమస్య కాదని నేను భావిస్తున్నాను. కానీ బౌలర్లకు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఇది చాలా ముఖ్యం" అని తెలిపాడు.

బౌలర్ల పనిభారాన్ని సరిగ్గా నిర్వహిస్తే, వారు ఎక్కువ కాలం ఆడగలరని సెహ్వాగ్ అన్నాడు. "ఆసియా కప్, ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో మన ఫాస్ట్ బౌలర్లు అందరూ ఫిట్‌గా అందుబాటులో ఉంటే, భారత్ గెలిచే అవకాశాలు మరింత పెరుగుతాయి" అని ఆయన అభిప్రాయపడ్డాడు.

కాగా, ఈసారి ఆసియా కప్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. యూఏఈ, పాకిస్థాన్, ఒమన్‌లతో తలపడనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. 14న దాయాది పాక్‌తో, 19న ఒమ‌న్‌తో ఆడ‌నుంది. 
Virender Sehwag
Asia Cup 2025
Team India
Abhishek Sharma
Jasprit Bumrah
Varun Chakravarthy
Workload Management
Indian Cricket Team
Asia Cup
Cricket

More Telugu News